Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

Author
Posted By Telangana Vaartha
| 03 Nov 2026, 12:33 AM | Array
Video Thumbnail

- ఉద్యోగాలు సాధించాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు మానసికంగా సిద్ధం కావాలి.
- అవకాశాలను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి.
– జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా పాత ఎస్పీ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ అధికారుల సమక్షంలో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆ పోటీని తట్టుకుని ఉద్యోగం సాధించాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు మానసికంగా కూడా సిద్ధం కావాలని అన్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక ప్రణాళికతో, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున నాణ్యమైన ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా మొత్తం 400 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం కల్పిస్తున్నామని, సూర్యాపేటలో 200 మందికి, కోదాడలో 200 మందికి శిక్షణ అందిస్తున్నామని వివరించారు. నిపుణులైన అధ్యాపకులు, ఫిజికల్ ఈవెంట్స్ శిక్షకుల ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోందన్నారు. అభ్యర్థులు ప్రతి సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంపొందించుకోవాలని, చదివే ప్రతి అంశాన్ని నోట్ పుస్తకంలో రాసుకోవాలని సూచించారు. గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసి ప్రశ్నల సరళిని అంచనా వేయాలని, అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. ప్రతి సబ్జెక్టును కనీసం మూడుసార్లు చదివి రివిజన్ చేయాలని సూచించారు. పోటీ పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఒత్తిడి వల్ల నేర్చుకున్న విషయాలను కూడా మర్చిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. సమాజంలో ఎన్నో ప్రశ్నలు, సవాళ్లు ఎదురవుతుంటాయని, వాటన్నింటికీ ఉద్యోగం సాధించడమే సమాధానం కావాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో నిరంతర కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు అన్ని రకాల సదుపాయాలు, అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని, తల్లిదండ్రులకు, కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కోసం నిర్వహించిన ఎంపిక పరీక్షకు సుమారు 1,400 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో ప్రతిభ ఆధారంగా 400 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఈ అవకాశంతో ఆగిపోకుండా, మరింత కష్టపడి చదివి తుది ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల జాబితాలో నిలవాలని ఆకాంక్షించారు. ఉద్యోగం సాధించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఏకాగ్రతతో లక్ష్యం వైపు ముందుకు సాగాలని సూచించారు. నిష్ణాతులైన అధ్యాపకులతో వివిధ సబ్జెక్టుల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నామని, అభ్యర్థుల శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు పోలీసు సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. అభ్యర్థులకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని, అధ్యాపకులు బోధించే ప్రతి అంశాన్ని నోట్ చేసుకోవాలని, ప్రతి సబ్జెక్టును పరీక్ష సమయం వచ్చేలోపు కనీసం మూడుసార్లు పునశ్చరణ చేయాలని సూచించారు. ప్రతి అంశంపై పూర్తి అవగాహన పెంపొందించుకుని నిరంతరం సాధన చేయడం ద్వారానే ఉద్యోగాలు సాధించడం సాధ్యమవుతుందని అన్నారు. సమస్యలు, ఒత్తిడికి గురికాకుండా వాటిని అధిగమించాలని, ఏకాగ్రతను కోల్పోకుండా అందుబాటులో ఉన్న ఈ సువర్ణ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలక్టర్ లు అనూష, రవితేజ, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్ముడ్ డీఎస్పీ నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, ఆర్ఎస్ఐలు సురేష్, సాయిరాం, అధ్యాపక బృందం, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.