Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పోలీసుల విధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే పోలీస్ ఓపెన్ హౌస్..

Author
Posted By Telangana Vaartha
| 24 Oct 2026, 11:48 PM | తాజావార్తలు Flash News
పోలీసుల విధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే పోలీస్ ఓపెన్ హౌస్..

పోలీసుల త్యాగాలను ప్రతి విద్యార్థి, పౌరుడు గుర్తుంచుకోవాలి: సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్..
సూర్యాపేట పట్టణం: పోలీస్ ఫ్లాగ్ డే, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఫింగర్‌ప్రింట్స్ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ విధులు, కేసుల దర్యాప్తు, నేరాల ఛేదన, నేరస్థులను గుర్తించే విధానాలు, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేరాలు జరిగినప్పుడు నేరస్థులను గుర్తించేందుకు పోలీసులు అనుసరించే దర్యాప్తు పద్ధతులు, సంఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, క్లూస్ టీమ్ విధులు, వేలిముద్రల సేకరణ, ఫింగర్‌ప్రింట్ పరికరాల ద్వారా పాత నేరస్థులను గుర్తించే విధానాలను అధికారులు విద్యార్థులకు వివరించారు.
పోలీసులు రాత్రివేళ నిర్వహించే పెట్రోలింగ్ బిట్స్ సమయంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వారిని ఫింగర్ ప్రింట్స్ డివైస్ సిస్టంతో తనిఖీ చేస్తామని అందులో ఉన్న డేటా ఆధారంగా వారి యొక్క నేర చరిత్ర తెలుస్తుందని దానికి సంబంధించి ఫింగర్ ప్రింట్ డివైస్ పరికరాల పనితీరును సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య విద్యార్థులకు వివరించారు. డాగ్ స్క్వాడ్ నేరాల దర్యాప్తులో ఎలా పనిచేస్తుంది, నేరస్థులను గుర్తించడంలో పోలీసు జాగిలాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి అనే విషయాలను ప్రదర్శన ద్వారా వివరించారు. ముఖ్యమైన కార్యక్రమాలు, వీఐపీల పర్యటనలు, పండుగలు తదితర సందర్భాల్లో బాంబ్ స్క్వాడ్ నిర్వహించే విధులు, భద్రతా తనిఖీల ప్రాధాన్యతను సంబంధిత సిబ్బంది వివరించారు. సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, డబ్బులు పంపాలని కోరినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అనుమానాస్పద కాల్స్, సందేశాలు వచ్చినప్పుడు పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలి అనే అంశాలపై సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని భరోసా టీమ్ ఎస్‌ఐ మౌనిక వివరించారు. మహిళలు, విద్యార్థినులు ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ప్రజల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యం: డిఎస్పీ ప్రసన్న కుమార్..
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడంతోపాటు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. సెలవులు, పండుగలు, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో నక్సలిజం ప్రభావం ఉన్న సమయంలో పోలీసులు ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, ప్రభుత్వ సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. సమాజాన్ని అసాంఘిక శక్తుల నుంచి రక్షించే క్రమంలో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని, వారి త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఆ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ ఫ్లాగ్ డే, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి పోలీసుల సేవలను, త్యాగాలను గుర్తించాలని డీఎస్పీ కోరారు. చట్టం అందరికీ సమానమని, నేరాలకు పాల్పడేవారిపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, చట్టాన్ని గౌరవించే ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.
విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు శాఖలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వివిధ విభాగాల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ నవీన్, బరోసా ఎస్ఐ మౌనిక, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, షీ టీం, భరోసా టీం సిబ్బంది పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.