Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

Author
Posted By Telangana Vaartha
| 24 Oct 2026, 08:52 PM | తాజావార్తలు Flash News
పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

జాతీయ రోడ్లపై ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం
జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల.జాతీయ రోడ్లపై జరిగే ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య సేవలు అందించే పీఎం రాహత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాదు నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పీఎం రాహత్ పథకం (రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రి చికిత్స,భరోసాతో కూడిన వైద్య సేవల పథకం) అంశాపై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించి,ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.ఈ పథకం కింద అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదయ్యే రోడ్డు ప్రమాద కేసులను సంబంధిత ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. బాధితుల వివరాల ధ్రువీకరణ కోసం ఆసుపత్రుల నుంచి వచ్చే అభ్యర్థనలపై పోలీసులు వెంటనే స్పందించాలని ఆదేశించారు.వాహనం బీమా పరిధిలో ఉన్న సందర్భాల్లో నిబంధనల ప్రకారం బీమా సంస్థల ద్వారా చికిత్స ఖర్చులను నేరుగా ఆసుపత్రులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రులకు సంబంధించిన చికిత్స ఖర్చులకు సంబంధించిన క్లెయిమ్‌లను జిల్లా కలెక్టర్లు సంబంధిత పోర్టల్ ద్వారా క్రమం తప్పకుండా పరిశీలించి, నిబంధనల ప్రకారం ఆమోదించాలన్నారు.ఆమోదించిన క్లెయిమ్‌లను తదుపరి చెల్లింపుల కోసం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ పోర్టల్‌కు పంపించి, అందుబాటులో ఉన్న నిధుల మేరకు ఆసుపత్రులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.రాష్ట్ర ఆరోగ్య ప్రాధికార సంస్థ నుంచి అందే క్లెయిమ్‌లను జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా పరిశీలించి, నిబంధనల ప్రకారం ఆమోదించాలని ఆదేశించారు. నెక్స్ట్‌జెన్ ఎం-పరివాహన్ మొబైల్ యాప్ ద్వారా రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని నమోదు చేయడం, పీఎం రాహత్ పథకం కింద క్లెయిమ్‌ల స్థితిని తెలుసుకోవడంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా మేజిస్ట్రేట్ బాధ్యతల బదిలీ సమయంలో సంబంధిత ఆన్‌లైన్ పోర్టల్‌లో అధికారిక ఇ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ వివరాలను తప్పనిసరిగా నవీకరించాలని పేర్కొన్నారు.జిల్లా రోడ్డు భద్రతా కమిటీలో జాతీయ సమాచార కేంద్రం జిల్లా సమాచార అధికారిని సభ్యుడిగా చేర్చి,రోడ్డు ప్రమాద కేసుల నమోదు,పథకం అమలుకు అవసరమైన సాంకేతిక సహకారం పొందాలని ఆదేశించారు.ప్రజలకు పథకంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సంబంధిత మొబైల్ అనువర్తనం ద్వారా రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని నమోదు చేయడం, చికిత్స ఖర్చుల చెల్లింపుల స్థితిని తెలుసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ నియమించిన ఫిర్యాదుల పరిష్కార అధికారి పథకానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి,సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేసుల ధ్రువీకరణ,ఆమోద ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. బాధితులకు చికిత్సలో జాప్యం జరగకుండా, అనవసరంగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసే పరిస్థితులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్లు పథకం అమలును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ,అర్హులైన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందేలా, ఆసుపత్రులకు చికిత్స ఖర్చుల చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పలు శాఖల జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడారు.

ఈ సమావేశంలో ఆర్టీఓ రాధిక , డిపో మేనేజర్ శ్రవణ్, ఆర్ అండ్ బి ప్రగతి, డీఏంహెచ్ఓ సంధ్య కిరణ్మయి,ఇతర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.