Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఉత్తమ ఫలితాల సాధనే ధ్యేయంగా బోధన సాగాలి

Author
Posted By Telangana Vaartha
| 23 Oct 2026, 06:58 PM | తాజావార్తలు Flash News
ఉత్తమ ఫలితాల సాధనే ధ్యేయంగా బోధన సాగాలి

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సులోచన రాణి సూచనలు
సూర్యాపేట, 23 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త విలేఖరి:-
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో గత ఏడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సులోచన రాణి సూచించారు. శుక్రవారం అకాడమిక్ తనిఖీలో భాగంగా సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ ప్రిన్సిపల్ పెరుమాళ్ళ యాదయ్య అధ్యక్షతన కళాశాలను సందర్శించి, కళాశాలలో విద్యా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి అధ్యాపకులకు దిశానిర్దేశం చేశారు.
కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హాజరు నమోదును పకడ్బందీగా నిర్వహించడంతో పాటు, అధ్యాపకుల బోధనా ప్రణాళికలు, రోజువారీ విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. గత ఏడాది విద్యా ఫలితాలను సమీక్షించి, ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని తెలిపారు.
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల అభ్యసన ప్రగతిపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారి స్థాయికి అనుగుణంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పాఠ్యాంశాల పునశ్చరణ, నమూనా ప్రశ్నపత్రాల సాధనకు తగిన సమయం కేటాయించి, విద్యార్థులు పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
కళాశాల ప్రయోగశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించి, విద్యార్థులకు ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని అందించాలని తెలిపారు. వృత్తి విద్యా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు సిద్ధాంత బోధనతో పాటు ప్రాయోగిక శిక్షణను సమర్థవంతంగా అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అధ్యాపకుల పాత్ర అత్యంత కీలకమని సులోచన రాణి అన్నారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి, వారిలో అభ్యసన ఆసక్తిని పెంపొందిస్తూ ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా ప్రమాణాల పెంపు, ఉత్తీర్ణత మెరుగుదల లక్ష్యంగా అధ్యాపకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.