Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

Author
Posted By Telangana Vaartha
| 21 Oct 2026, 12:11 PM |
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

- పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం.
- ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఎప్పటికీ మరువం.
- ప్రజలకు నిబద్ధతతో సేవ చేయడమే అమరవీరులకు నిజమైన నివాళి.
- అమరవీరుల త్యాగం వృథా కానివ్వం..
- ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం..
- చట్టాన్ని గౌరవిస్తాం.. న్యాయాన్ని పరిరక్షిస్తాం.. ప్రజాసేవలో ముందుంటాం..
....సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ.

సూర్యాపేట, అక్టోబర్ 21:- ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో అమరులైన పోలీసు వీరుల త్యాగాలు చిరస్మరణీయమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం, పోలీసు ఫ్లాగ్ డే సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విది నిర్వహణలో దేశ వ్యాప్తంగా ప్రాణాలు అర్పించిన 154 మంది అమరవీర జవాన్ ల పేర్లను అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి స్మరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కేవలం గతంలో ప్రాణత్యాగం చేసిన పోలీసు వీరులను స్మరించుకునే రోజు మాత్రమే కాదని, వారి త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది ప్రజలకు మరింత నిబద్ధతతో సేవలు అందించాలని ప్రతిజ్ఞ చేసే రోజని పేర్కొన్నారు. ప్రజలు తమ కుటుంబాలతో ప్రశాంతంగా జీవించడానికి, సమాజంలో శాంతిభద్రతలు కొనసాగడానికి, మహిళలు, పిల్లలు, వృద్ధులు భయం లేకుండా జీవించడానికి పోలీసు సిబ్బంది నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. పోలీసు ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం కాదని, అది బాధ్యత, నిబద్ధత, సేవాభావంతో కూడిన పవిత్రమైన వృత్తి అని అన్నారు. విధి నిర్వహణలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో తెలియని పరిస్థితుల్లోనూ ప్రజల రక్షణే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతారని పేర్కొన్నారు. పోలీసు యూనిఫాం కేవలం దుస్తులు మాత్రమే కాదని, ప్రజలు పోలీసు శాఖపై ఉంచిన నమ్మకానికి, గౌరవానికి ప్రతీక అని తెలిపారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యత అని స్పష్టం చేశారు.
సూర్యాపేట గడ్డపై ప్రాణత్యాగం చేసిన పోలీసు వీరులు..
తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పై నక్సల్స్ చేసిన దాడిలో హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్ అమరుడైనారు. సూర్యాపేట పట్టణంలోని హైటెక్ బస్టాండ్ వద్ద 2015 ఏప్రిల్ 2న వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు దాడిలో కానిస్టేబుల్ ఎం. లింగయ్య, హోంగార్డు కె. మహేష్ తమ ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శీలం కమలాకర్ ను కారు డికొనడంతో అమారులైనారు. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగం పోలీసు శాఖకు, వారి కుటుంబాలకు తీరని లోటని పేర్కొన్నారు. వారి పేర్లను స్మరించుకోవడం అంటే కేవలం వారి సేవలను గుర్తుచేసుకోవడం మాత్రమే కాదని, ప్రజల భద్రత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండే పోలీసు ధర్మాన్ని గుర్తుచేసుకోవడమని అన్నారు.
అమరులైన పోలీసు వీరుల త్యాగాలు ఎప్పటికీ వృథా కావని, వారి ధైర్యం, కర్తవ్యనిష్ఠ, సేవాభావం నేటి పోలీసు సిబ్బందికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడంలో ప్రతి పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.. విధి నిర్వహణలో ఒక పోలీసు అధికారి లేదా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినప్పుడు వారి కుటుంబం అపారమైన బాధను ఎదుర్కొంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ఒక కుటుంబం తన ఆత్మీయుడిని, ఒక భార్య తన జీవిత భాగస్వామిని, ఒక తల్లి తన బిడ్డను, ఒక చిన్నారి తన తండ్రిని కోల్పోయే పరిస్థితి ఎంతో బాధాకరమని అన్నారు. అమరవీరుల కుటుంబాలు ఎదుర్కొనే బాధను ఏ మాటలూ పూర్తిగా తీర్చలేవని, వారు కోల్పోయిన ఆత్మీయుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తెలిపారు. అయితే, వారి కుటుంబాల సంక్షేమాన్ని పరిరక్షించడం, వారి పిల్లల భవిష్యత్తుకు అండగా నిలవడం, వారు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించేలా సహకరించడం పోలీసు శాఖ బాధ్యత అని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి త్యాగాలను గౌరవిస్తూ వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను గౌరవించడం, వారి సేవలను భావితరాలకు తెలియజేయడం మనందరి నైతిక బాధ్యత అని అన్నారు.
ప్రజలకు న్యాయం చేయడమే అమరవీరులకు నిజమైన నివాళి..
పోలీసు అమరవీరులకు నిజమైన నివాళి కేవలం పుష్పగుచ్ఛాలు సమర్పించడం, స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పించడం మాత్రమే కాదని, విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా, మానవీయ దృక్పథంతో నిర్వహించడమేనని ఎస్పీ స్పష్టం చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలని, మహిళలు, పిల్లలు, వృద్ధులు, బలహీన వర్గాలకు భరోసా ఇవ్వాలని సూచించారు. నేరస్తుల పట్ల చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తూనే, అమాయక ప్రజల పట్ల గౌరవం, సహానుభూతితో వ్యవహరించాలని తెలిపారు. పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు ప్రతి అధికారి, సిబ్బంది తమ ప్రవర్తనలో పారదర్శకతను, విధి నిర్వహణలో నిబద్ధతను ప్రదర్శించాలని అన్నారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరిస్తూ, బాధితులకు అండగా నిలుస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌ను కొనసాగించాలని సూచించారు.
ప్రస్తుత కాలంలో నేరాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ సైబర్ నేరాలను అరికడుతున్నం అని ఎస్పీ తెలిపారు. సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు. యువతను మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు సమష్టిగా కృషి చేయాలని, నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.
ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తన విధిని ప్రజాసేవగా భావించి పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పోలీసు శాఖపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మరింత పెంపొందిస్తూ, సమాజంలో శాంతి, భద్రతలకు భరోసా కల్పించాలని తెలిపారు.
అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం.. పోలీసు అమరవీరులు తమ ప్రాణాలను అర్పించి పోలీసు శాఖ గౌరవాన్ని నిలబెట్టారని, నేటి పోలీసు సిబ్బంది తమ నిబద్ధత, నిజాయితీ, కర్తవ్యనిష్ఠతో ఆ గౌరవాన్ని మరింత పెంచాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అర్పించే నివాళి కార్యక్రమానికే పరిమితం కాకుండా, వారి త్యాగాలు ప్రతి పోలీసు అధికారి ఆలోచనల్లో, ప్రవర్తనలో, విధి నిర్వహణలో ప్రతిరోజూ ప్రతిబింబించాలని అన్నారు. అమరవీరుల ధైర్యం మనకు ఆదర్శం కావాలని, వారి త్యాగం మనకు స్ఫూర్తినివ్వాలని, వారి సేవాభావం మనకు మార్గదర్శకంగా నిలవాలని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ తరఫున విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రతి పోలీసు వీరుడికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు గౌరవపూర్వక వందనాలు తెలియజేస్తూ, వారి త్యాగాలను ఎప్పటికీ మరువబోమని స్పష్టం చేశారు. స్మృతి పరేడ్‌కు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జానయ్య పరేడ్ కమాండర్‌గా వ్యవహరించగా, కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను ఆర్ముడ్ డీఎస్పీ నరసింహాచారి నిర్వహించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమరులైన పోలీసు వీరులకు ఘనంగా నివాళులర్పించారు.
స్మృతి పరేడ్‌లో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డీఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహాచారి, ఇన్‌స్పెక్టర్లు రామారావు, శివకుమార్, వెంకటయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్ రావు, చరమందరాజు, ప్రతాపలింగం, రామకృష్ణ రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, నారాయణ రాజు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీసు అధికారులు, పోలీస్ సంఘం అధ్యక్షులు రమేష్, సెక్రెటరీ కిరణ్, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, పౌరులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.