Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

హుస్సేన్ సాగర్ తీరాన అట్టహాసంగా ప్రారంభమైన సద్దుల బతుకమ్మ సంబరాలు!

Author
Posted By Telangana Vaartha
| 18 Oct 2026, 11:12 PM | తాజావార్తలు Flash News
హుస్సేన్ సాగర్ తీరాన అట్టహాసంగా ప్రారంభమైన సద్దుల బతుకమ్మ సంబరాలు!

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా – జానకి దంపతులు
వేడుకలకు హాజరైన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీప్రసాద్
720 మంది కళాకారులతో 30 కళారూపాల ప్రదర్శన
700 బతుకమ్మలతో హుస్సేన్ సాగర్ తీరాన సందడి చేసిన ఆడపడుచులు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళారూపాల వైభవాన్ని చాటుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలు
మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరికీ, ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
మన బతుకును కోరే అమ్మ బతుకమ్మ. బతుకమ్మ ఆడే ఆడపడుచులంతా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను
ఈ సద్దుల బతుకమ్మ వేడుకలకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారికి హృదయపూర్వక స్వాగతం, ధన్యవాదాలు.
పిలవగానే వచ్చి మన తెలంగాణ పూల పండుగలో పాల్గొన్న ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇలాంటి వేడుకల్లో ప్రముఖులు పాల్గొనడం వల్ల మన పండుగలకు మరింత ప్రాచుర్యం లభిస్తుంది. యువత మన సంస్కృతి, సంప్రదాయాలకు మరింత దగ్గరవుతుంది.
బతుకమ్మ మన రాష్ట్ర పండుగ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక.
రంగురంగుల పూలను పేర్చి, పూలనే దేవతగా కొలిచే గొప్ప పండుగ బతుకమ్మ.
తరతరాలుగా మన మహిళలు ఈ పండుగ ద్వారా మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్నారు.
కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒకచోట చేర్చి, ఐక్యతను చాటిచెప్పే పండుగ బతుకమ్మ.
హుస్సేన్ సాగర్ తీరాన ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ఈ సంబరాలు తెలంగాణ సంస్కృతీ వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
బతుకమ్మ పాటలు, పూల అలంకరణలు, జానపద కళారూపాలతో తెలంగాణ సంప్రదాయాల వైభవం ప్రతిబింబిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తోంది.
బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. తంగేడు, గునుగు, బంతి వంటి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చడం ప్రకృతితో మనకున్న అనుబంధానికి నిదర్శనం.
ప్రకృతిని పూజించడంతోపాటు ప్రకృతిని పరిరక్షించడం కూడా మన సంప్రదాయంలో భాగం కావాలి.
వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, నదులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు పర్యావరణహితంగా పండుగలను జరుపుకుందాం.
తెలంగాణకు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. మన భాష, యాస, పల్లె జీవనశైలి ఎంతో ప్రత్యేకమైనవి.
మన పండుగలు, కళారూపాలు, జానపద సంపదను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం మనందరి బాధ్యత.
ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ వేడుక జరిగినా తెలంగాణ పల్లె జానపదాలు మారుమోగుతున్నాయి. మన జానపద గేయాలు విస్తృత ప్రజాదరణ పొందుతున్నాయి.
ఒకప్పుడు దేశవ్యాప్తంగా హిందీ పాటలతో పాటు పంజాబీ పాటలు విశేషంగా వినిపించేవి. ఇప్పుడు మన తెలంగాణ జానపద గేయాలు కూడా అదే విధంగా విస్తృత ప్రజాదరణ పొందుతున్నాయి.
సోషల్ మీడియా రీల్స్ నుంచి సినిమా పాటల వరకు తెలంగాణ జానపదాల ప్రభావం కనిపిస్తోంది. లక్షలాది, కోట్లాది వీక్షణలతో మన పాటలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
మన పాటల్లోని తెలంగాణ యాస, పల్లె జీవనశైలి, మట్టి పరిమళాలు ప్రజలకు చేరువవుతున్నాయి.
తెలంగాణ జానపద గేయాలు కేవలం వినోదానికే పరిమితం కావడం లేదు. మన సంస్కృతిని, మన అస్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి.
తెలంగాణ గేయ రచయితలు రాసిన సినిమా పాటలు కూడా విశేష ప్రజాదరణ పొందుతున్నాయి.
ఈ ఘనత సాధిస్తున్న తెలంగాణ మట్టి బిడ్డలైన గేయ రచయితలకు, గాయకులకు, కళాకారులకు నా హృదయపూర్వక అభినందనలు.
తెలంగాణ కవులు, కళాకారులు, గేయ రచయితలు, సాహితీవేత్తలు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతినిధులు. వారి సృజనాత్మకత వల్ల మన భాష, యాస, జానపద కళలకు మరింత గుర్తింపు లభిస్తోంది.
కళాకారులను గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించడమే. తెలంగాణ కళాకారులను ప్రోత్సహించడానికి, మన కళారూపాలను భావితరాలకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.
మన యువత తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాల పట్ల గర్వంగా ఉండాలి. మన జానపద గేయాలు, కళారూపాలను ఆదరిస్తూ ప్రపంచానికి పరిచయం చేయాలి.
తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కళాకారులు, స్వచ్ఛంద సేవకులు, ఇతర భాగస్వాములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి, మహిళల ఆత్మగౌరవం, మన ఐక్యతకు ప్రతీకగా నిలవాలి.
మన సంప్రదాయాలను కాపాడుకుంటూ, మన కళాకారులను ప్రోత్సహిస్తూ తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుదాం.
బతుకమ్మ, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతర వంటి పండుగలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. మన పండుగలు, జానపద కళలు, చారిత్రక ప్రదేశాలు తెలంగాణ పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపునిస్తాయి.మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలంగాణను ప్రముఖ సాంస్కృతిక పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టేందుకు కృషి చేద్దాం.తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ, రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీ అందరినీ కోరుతున్నాను.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తెలంగాణ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని ఆహ్వానిస్తున్నాను.మరోసారి తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా మన ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.