Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పోలీసు, ఎసిబి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల పేర్లతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు, పీడీ యాక్ట్ నమోదు

Author
Posted By Telangana Vaartha
| 09 Oct 2026, 02:48 PM | తెలంగాణ Telangana
పోలీసు, ఎసిబి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల పేర్లతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు, పీడీ యాక్ట్ నమోదు

ముఖ్యమైన పాయింట్స్:

  • సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ

- ఎసిబి, సిబిఐ, సిఐడి, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులమని చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదు.
- ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు నకిలీ ఫోన్ కాల్స్‌ను నమ్మి డబ్బు పంపవద్దు.
- అక్రమ వసూళ్లకు పాల్పడే నకిలీ వ్యక్తులపై తీవ్రమైన చట్టాల కింద కేసులు నమోదు.
- బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు లేదా డయల్ 112 కు ఫిర్యాదు చేయాలి.
... సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ.

సూర్యాపేట:(Suryapet Town) పోలీసు అధికారులు మరియు వివిధ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎసిబి, సిబిఐ, సిఐడి, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పేర్లు చెప్పుకుంటూ నకిలీ వ్యక్తులు ప్రజలను, ప్రభుత్వ అధికారులను, వ్యాపారవేత్తలను, వివిధ సంస్థల ప్రతినిధులను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినా లేదా అక్రమ వసూళ్లకు పాల్పడినా ఉపేక్షించేది లేదని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ తీవ్రంగా హెచ్చరించారు. సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా అపరిచిత వ్యక్తులు నకిలీ ఏసీబీ అధికారులుగా చలామణి అవుతూ, సస్పెండ్ అయిన, అవినీతి విచారణ ఎదుర్కొంటున్న అధికారుల వివరాలను వార్త పత్రికలు, మీడియా ద్వారా తెలుసుకుని అధికారులను ఫోన్ ద్వారా బెదిరిస్తూ అక్రమ అర్జనలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై నిఘా ఉంచాం అన్నారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌ను బెదిరించి, నకిలీ ఏసీబీ అధికారులు ఫోన్ ద్వారా భయపెట్టి బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు బదిలీ చేయించుకున్న ఘటనపై గతంలో కేసు నమోదైంది అన్నారు. ఇటీవల జిల్లాలో సస్పెండ్ అయిన కొందరు అధికారులకు కూడా నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు దృష్టికి వచ్చిందని దీనిపై విచారణ జరుగుతున్నదని ఎస్పీ తెలిపారు. బాధితులు నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏసీబీ (ACB) అనేది అవినీతిపరుల ఆటకట్టించడానికి పక్కా ప్రణాళికతో పనిచేసే స్వతంత్ర వ్యవస్థ. వీరి విచారణలు, దాడులు, కేసులకు సంబంధించిన సమాచారం అత్యంత రహస్యంగా ఉంటుంది అన్నారు. ఏసీబీ లేదా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులు ఏ వ్యక్తికీ లేదా అధికారికి ముందస్తుగా ఫోన్ చేసి సమాచారాన్ని లీక్ చేయరు, డబ్బులు డిమాండ్ చేయరు అన్నారు. పోలీసులమని లేదా దర్యాప్తు సంస్థల అధికారులమని నమ్మిస్తూ బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల ప్రకారం ఎక్స్‌టార్షన్, రాబరీ వంటి తీవ్రమైన నేరాల కింద కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు. ఇలాంటి నకిలీ వ్యక్తుల చర్యల వల్ల ప్రభుత్వ వ్యవస్థల విశ్వసనీయతకు, ప్రజల భద్రతకు భంగం వాటిల్లితే నేర తీవ్రతను బట్టి వ్యవస్థీకృత నేరాల కింద కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని ఎస్పీ గారు హెచ్చరించారు. ఇలాంటి వాటికి పాల్పడే నకిలీ వ్యక్తులు ఎంతటి సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించి వారిని పట్టుకుని చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటాం అన్నారు.
ప్రజలు & ప్రభుత్వ అధికారులకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి:.:
దర్యాప్తు సంస్థల అధికారులమని చెప్పి ఫోన్లలో బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు, వారి ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, అనుమానాస్పద ఫోన్ కాల్స్ వచ్చినా, లేదా ఇప్పటికే మోసపోయి ఉన్నా ధైర్యంగా సమీప పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలి. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉన్న వెంటనే డయల్ 112 (Dial 112) కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.