Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఇటుక బట్టీల మంటలు... ప్రకృతి కంట కన్నీటి దారలు..!

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 08 Oct 2026, 09:59 PM | తెలంగాణ Telangana
ఇటుక బట్టీల మంటలు... ప్రకృతి కంట కన్నీటి దారలు..!

తిరుమలగిరి 09 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం పలు గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా దొడ్డిదారిన, దొంగ చాటుగా, యదేచ్చగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తుండడంతో పర్యావరణానికి ముప్పు సంభవిస్తుంది. ఇటుక బట్టీల మాఫియాతో పర్యావరణం, సారవంతమైన భూములు మాయమయ్యాయి. ఇటుక పట్టిలు పొలాలను తోడేస్తుండడంతో భూగర్భ జలాలకు ముప్పు వాటిల్లుతుంది. దీనివల్ల గాలి కాలుష్యంతో పంటలకు నష్టం కలుగుతుంది. పచ్చని పొలాల్లో నల్లని పొగ అలుముకుంటుంది. ఇటుక బట్టీల దందా కొనసాగుతున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికారులు అండతోనే ఇటుక బట్టీల జోరు బాగుందని విమర్శలు వస్తున్నాయి. కళ్ళు ఉండి అధికారులు చూడకపోవడంతో బట్టీల దందా జోరుగా సాగుతుంది. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చిన అధికారులు పట్టించుకోకుండా బుట్ట దాఖలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. అసలు ఇటుక బట్టీలకు అనుమతులు ఉన్నాయా, పర్యావరణానికి ముప్పు కలుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు, సారవంతమైన భూములు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటారా, అసలు ఇటుక బట్టీల వెనక ఎవరి హస్తం ఉంది, పొలాల్లో బట్టీలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వ రూల్స్ ఏమయ్యాయి, ఎటుపోయాయి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మట్టిని కూడా ఇతర జిల్లాల నుంచి సూర్యాపేటకు తరలిస్తున్నారు. వాస్తవానికి ఇటుక బట్టిల యజమానులు తెలంగాణ వారి కంటే ఇటుక బట్టీల నిర్వహణలో రాటుదేలిన, అనుభవం ఉన్న ఆంధ్ర వారే ఎక్కువగా ఇక్కడ ఇటుక బట్టిలను పెడుతున్నారు. ఇక్కడ కార్మికులు వేతనం ఎక్కువ అడుగుతారని బీహార్, చత్తీస్గడ్, ఒరిస్సా, అస్సాం రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కూలీలను ఇటుక బట్టి తయారీకి తెప్పిస్తున్నారు.

బీడు భూములుగా మారి, భూగర్భ జలాలు తగ్గి, కాలుష్యం పెరిగి

పచ్చని పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. ఇసుక మాఫియా పేరుతో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి పోతుండగా సూర్యాపేట జిల్లాలో ఇటుక బట్టి మాఫియా కూడా అంతే స్థాయిలో జోరుగా నిర్వహిస్తున్నట్టడంతో భూగర్భ జలాలు రోజుకు రోజుకు తగ్గిపోతున్నాయి. అసలే ఎల్ నినో ప్రభావము మూలంగా పర్యావరణం కు తీవ్ర విఘాతం కలిగి వర్షాల జాడ లేక కరువు జాడలు కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ పచ్చని చెట్లను నరికి వేస్తూ పర్యావరణానికి ముప్పు చేపడుతున్న నేపథ్యంలో ప్రకృతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదే అదనుగా జిల్లాలో ఇటుక బట్టీల వ్యాపారం జోరందుకుంటుంది. ఒక్కో ఇటుక బట్టి వద్దకు వెళుతున్న అధికారులు తమ మామూళ్లు తమకు ఇస్తే చాలు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నట్టుగా ప్రవర్తించడంతో నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. వాస్తవానికి ఇటుక బట్టి ఏర్పాటు చేయాలంటే గ్రామీణ ప్రాంతాలలో అయితే గ్రామపంచాయతీ, మున్సిపల్ ప్రాంతాల్లో అయితే మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరి. దీనికి తోడు రెవిన్యూ, మైనింగ్, విద్యుత్, కార్మిక,రవాణా, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అనుమతి కూడా తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇటుక బట్టీల నిర్వహణలో రాటు తేలిన ముదురులైన యజమానులు ఎక్కడ చేయి తడిపితే పని అవుతుందో తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చాల్సి వస్తే అందుకు నాలా పన్ను కూడా చెల్లించాల్సి ఉంటున్నప్పటికీ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ చెరువుల మట్టిని ఇష్టం వచ్చిన రీతిగా తొవ్వుకుంటూ తెల్లవారులు టిప్పర్ల ద్వారా మట్టిని డంపు చేసుకుంటున్నారు. క్యూబిక్ మీటర్ కు దాదాపు 50 రూపాయల వరకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ 'పటేల్,పట్వారి మా పట్టు ఉంటే ఇంకా మాకేమి ఎదురు' అన్నట్టుగా మట్టి తవ్వుకొని తరలిస్తే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తమ ఇష్టానుసారంగా ఇటుక బట్టి యజమానులు వ్యవహరిస్తున్నారన్న అపవాదు ఉంది. సుమారు లక్ష ఇటుకలు తయారు చేస్తే పదివేల రూపాయల పైగా ప్రభుత్వానికి పన్నుల రూపంలోచెల్లించాల్సి ఉన్నప్పటికీ అలాంటి దాఖలాలు ఏమి కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ లో ప్రారంభమయ్యే ఇటుక బట్టీల వ్యాపారం ఉగాదితో ముగుస్తుంది. జిల్లాలో సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల పైగా మట్టిని ఇటుక బట్టీల అవసరం కోసం వినియోగిస్తున్నారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇటుక బట్టీల వల్ల అటు పచ్చని పొలాలు, ఇటు పచ్చని అడవులు, మరోపక్క భూగర్భ జలాలు అంతరించి ఉండగా, కాలుష్యం నానాటికి పెరిగి పర్యావరణ పరిరక్షణకు తూట్లు పొడుస్తుంది అన్న వాస్తవాన్ని ఇటుక బట్టీల యజమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మౌనముద్రలో... మామూళ్ల మత్తులో అధికారులు?

హోటళ్లతో పాటు, పరిశ్రమలు, ఇటుక బట్టీలలో 14 సంవత్సరాల లోపు బాల బాలికలు పనిచేయకుండా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ తదితర చర్యలు పోలీస్ శాఖ కార్మిక శాఖ తో కలిసి సంయుక్తంగా తనిఖీలు చేపట్టి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేస్తుంది. అయితే సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే ఈ విధంగా పోలీసుల తనిఖీలు ఉండడంతో మిగతా సమయాలలో ఇటుక బట్టీలలో ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను సైతం తీసుకువచ్చి ఇటుకలు తయారు చేపిస్తుంటారు. వారికి కనీస వేతన చట్టం కూడా అమలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా తనిఖీల పేరుతో మైనింగ్ శాఖ వారు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారన్న వ్యాఖ్యలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ అనుమతి లేకపోవడంతో వాస్తవానికి ఇటుక బట్టి యజమాని సొంత జిల్లా కాకుండా ఇతర ప్రాంతానికి ఇటుకలు తరలిస్తే అక్కడ తనిఖీల్లో పట్టుబడితే భారీ ఎత్తున జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ ఖర్చులు మాత్రం అధికారులకు ఎలాగూ తప్పడం లేదు, కనీసం అనుమతి ఉన్నట్టు కూడా ధ్రువపత్రాలు జారీ చేయకపోవడంతో ఇటుక బట్టీల యజమానులు కూడా డబ్బులు కట్టి మరీ నష్టపోతున్నారని వాపోతున్నారు. అలాగే మట్టి ఇటుకల కోసం ఎక్కువ మొత్తంలో మట్టి అవసరం ఉంటుంది. దీనికోసం పచ్చని పంట పొలాలను సారవంతమైన పైపులను తొలగించడంతో పంటలు పండగ భూములు బీడులుగా మారుతున్నాయి. ఎలాంటి అనుమతి తీసుకోకుండా తమకు ఇష్టం వచ్చినంత లోతుగా మట్టిని తవ్వుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. తయారైన ఇటుకను కాల్చడానికి ఎక్కువ మొత్తంలో కట్టెలు కావాల్సి వస్తుంది. దీంతో చుట్టుపక్కల ఉన్న చెట్లు అన్నింటిని కొట్టి ఇటుక బట్టీలను కాల్చడంతో పొగ పర్యావరణం ముప్పు మాత్రమే కాకుండా చెట్లు అంతరించడంతో ప్రకృతి వేడెక్కుతుంది. తద్వారా వర్షాబావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎల్ నినో రావడానికి ప్రకృతిలో పచ్చదనం తగ్గిపోవడమే కారణం అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా యదేచ్చగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇటిక బట్టీల వద్ద నుండి వెళుతున్న కరెంటు స్తంభాల వద్ద నుంచి అనధికారికంగా కరెంటును వాడుకోవడంతో ఆ శాఖ కూడా నష్టాల బారిన పడుతుంది. తెలిసి తెలియనట్లు, చూసి చూడనట్లు విద్యుత్ శాఖ అధికారులు కూడా తమ వంతు తాము పుచ్చుకొని వదిలేస్తున్నట్లు సమాచారం. వేతన చట్టం అమలు కానప్పటికి, 14 సంవత్సరాల లోపు వారు పని చేస్తున్నప్పటికీ కార్మిక శాఖ పట్టింపు లేకపోవడం కాకుండా వారికి అందాల్సింది కూడా వారికి అందుతుందనే విమర్శలు ఉన్నాయి. అటవీశాఖ కూడా తమ కళ్ళముందే అడవులను నరికి వేస్తున్నప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరించడానికి వేటు వేయకుండా రేటు మాట్లాడుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చర్యలు చేపట్టాల్సిన కాలుష్య నియంత్రణ మండలి కూడా కిమ్మనకుండా ఉండడంతో పర్యావరణం పొగతో మసకబారుతుంది. గాలిలో పొగ కాలుష్యం ఎక్కువ జరిగి ప్రజల ఊపిరితిత్తులు ఆస్పత్రి పాలు కావాల్సి వస్తుంది. వాస్తవానికి నివాస ప్రాంతాలకు కనీసం ఐదు కిలోమీటర్ల పైగా దూరంలో ఇటుక బట్టీలు ఉండాల్సి ఉన్నప్పటికీ జనావాస ప్రాంతాల్లో ఉండడంతో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలు దగ్గు, నిమ్ము, ఆయాసం, అస్తమా, హార్ట్ ఎటాక్, ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మట్టి ఇటుకలే కాకుండా లైట్ వెయిట్ వలన కూడా పర్యావరణానికి ముప్పు

జిల్లాలో కేవలం మట్టి ఇటుకల మాఫియాని కాకుండా లైట్ వెయిట్ ఇటుకల తయారీ మాఫియా వలన కూడా పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతుంది. సూర్యాపేట సమీపంలో ఇటీవల లైట్ వెయిట్ ఇటుకల మిషన్ పేలిపోవడంతో భారీ ప్రమాదం జరిగింది. లైట్ వెయిట్ సిమెంట్ ఇటుకల తయారీకి కూడా కలప అవసరం కావడంతో అడవులు అంతరిస్తున్నాయి. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సంయుక్తంగా, సమర్థవంతంగా, సముచితంగా, సామరస్యంతో తనిఖీలు నిర్వహించి ఇటుక బట్టీల మాఫియా అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలని సూర్యాపేట జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇందుకుగాను ఆయా శాఖల ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి మట్టి ఇటుక బట్టీలు, లైట్ వెయిట్ సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీలలో జరుగుతున్న దందాను అరికట్టి సక్రమ నిర్వహణకు చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.