Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలి

Author
Posted By Telangana Vaartha
| 01 Oct 2026, 06:22 PM |
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

ఓటర్లను కార్యాలయాలకు పిలిచి నోటీసులు ఇవ్వడం, పత్రాలు స్వీకరించడం చేయరాదు

బీఎల్ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేసి, పత్రాలను ఇంటి వద్దే స్వీకరించాలి

ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలి - Additional Image

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆన్‌లైన్‌లో విచారణ నిర్వహించాలి

ఇవి కూడా చదవండి

ఫారం-6, ఫారం-7, ఫారం-8 వివరాలను రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలి
31.10.2023 కట్ ఆఫ్ తేదీగా పరిగణించి అర్హులైన గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయాలి
ఎస్‌ఐఆర్-2026, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి

ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను భారత ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఎస్‌ఐఆర్-2026, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లను నోటీసులు అందుకోవడానికి లేదా అవసరమైన పత్రాలు సమర్పించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల కార్యాలయాలకు పిలవరాదని స్పష్టం చేశారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైన పత్రాలను వారి ఇళ్ల వద్దే స్వీకరించాలని సూచించారు.
ఇకపై సాధారణంగా ఓటర్లను విచారణ (హియరింగ్) కోసం కార్యాలయాలకు పిలవరాదని సీఈఓ తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో విచారణ నిర్వహించాల్సి వస్తే ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని, ఈ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఫారం-6 డిక్లరేషన్ తప్పనిసరి
కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని సీఈఓ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ నిర్వహించని రాష్ట్రాల్లో కొత్త ఓటరు నమోదుకు డిక్లరేషన్ అవసరం లేకపోయినప్పటికీ, తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు సందర్భంగా డిక్లరేషన్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈఆర్ఓ కార్యాలయాల నోటీసు బోర్డులపై ఫారం-6, ఫారం-7కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. ఓటర్లకు జారీ చేయాల్సిన పెండింగ్ నోటీసులపై కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.
ఫారం-6, పెండింగ్ నోటీసులు, ఫారం-7, ఫారం-8కు సంబంధించిన అన్ని వివరాలను అన్ని స్థాయిల్లోని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సీఈఓ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ, రాజకీయ పార్టీలకు అవసరమైన సమాచారాన్ని నిబంధనల ప్రకారం అందించాలని సూచించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి సూచించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో 31.10.2023ను అర్హత తేదీగా పరిగణించి, అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదైన వారు కూడా ప్రస్తుత నమోదు ప్రక్రియలో మరోసారి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సీఈఓ సూచించారు. ఓటరు నమోదుకు సమర్పించే మార్కుల మెమో జిరాక్స్ ప్రతిని గెజిటెడ్ అధికారి ద్వారా ధృవీకరించి సమర్పించేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో అధికారులు, బీఎల్ఓలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఈఓ ఆదేశించారు. ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతి దశను పారదర్శకంగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులతో సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న నోటీసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి పెండింగ్ నోటీసులను సంబంధిత ఓటర్లకు అందజేసి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, పెండెన్సీని క్రమంగా తగ్గించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఇంటింటి పర్యటనలను సమర్థవంతంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజు, ఎన్నికల విభాగం అధికారులు రాజేందర్ రెడ్డి, భరత్, రణధీర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.