Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సూర్యాపేట జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు

Author
Posted By Telangana Vaartha
| 26 Sep 2026, 02:17 AM |
సూర్యాపేట జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు

పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.. అన్ని శాఖల సమన్వయం.. ఉత్సవ కమిటీలు, ప్రజల సహకారం అభినందనీయం.
- సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు – జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో వినాయకచవితి నుండి ప్రారంభమైన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, గణేశ్ మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ఠాపన, నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలు మరియు నిమజ్జన కార్యక్రమాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగిశాయని జిల్లా ఎస్పీ కె. నరసింహా ఐపీఎస్ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని అన్నారు. జిల్లా పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర శాఖల సమన్వయంతో ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధుల్లో పాల్గొని శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా కృషి చేశారని అన్నారు.
ప్రతి గణేశ్ మండపంపై ప్రత్యేక పర్యవేక్షణ.
గణేశ్ చవితి నుంచి జిల్లాలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భద్రత కల్పించిందని ఎస్పీ తెలిపారు. ప్రతి మండపాన్ని ఆన్‌లైన్ జియో-ట్యాగింగ్ చేసి పోలీస్ పర్యవేక్షణలోకి తీసుకురావడం జరిగిందన్నారు. మండపాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతా పరిస్థితులను పర్యవేక్షించడం జరిగిందని, ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది ప్రతిరోజూ రెండు నుంచి మూడు విడతల్లో మండపాలను సందర్శించి నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ భద్రత కల్పించారని తెలిపారు.
ముందస్తు అవగాహన కార్యక్రమాలతో సత్ఫలితాలు..
గణేశ్ ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, భక్తులకు పోలీస్ శాఖ ముందస్తుగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించిందని ఎస్పీ తెలిపారు. అన్ని మతాల వారు పరస్పర గౌరవం, సామరస్యంతో ఉత్సవాలు నిర్వహించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. శోభాయాత్రలు, నిమజ్జన సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు అందించామని తెలిపారు.
డీజేలకు దూరంగా.. సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు..
డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌ల వల్ల కలిగే ప్రమాదాలు, ప్రజలకు కలిగే అసౌకర్యం మరియు ప్రాణనష్టానికి దారితీసే పరిస్థితులపై ఉత్సవ కమిటీలు, యువతకు పోలీస్ శాఖ అవగాహన కల్పించిందని ఎస్పీ తెలిపారు. పోలీసుల సూచనలను ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, యువత స్వచ్ఛందంగా పాటించి డీజేలకు దూరంగా ఉండి సాంప్రదాయ పద్ధతిలో గణేశ్ ఉత్సవాలు, శోభాయాత్రలు నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు.
శోభాయాత్రలు, నిమజ్జనాల సమయంలో పటిష్టమైన బందోబస్తు..
జిల్లాలోని ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో నిర్వహించిన గణేశ్ శోభాయాత్రలు మరియు నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిందని ఎస్పీ తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో ముందస్తుగా అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, క్రేన్ల ఏర్పాటు, లైటింగ్ తదితర అంశాలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పర్యవేక్షించినట్లు తెలిపారు.
ప్రజల సహకారం అభినందనీయం..
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా ముగించడంలో జిల్లా ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, భక్తులు, వాహనదారులు, యువత మరియు అన్ని వర్గాల ప్రజలు అందించిన సహకారం ఎంతో విలువైనదని అన్నారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం, వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, విద్యుత్, వైద్య, అగ్నిమాపక మరియు ఇతర శాఖల అధికారులు అందించిన సమన్వయం, సహకారానికి జిల్లా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలు మరియు నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల సహకారంతోనే ఇలాంటి పెద్దఎత్తున జరిగే కార్యక్రమాలను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం. భవిష్యత్తులో కూడా ప్రజలు ఇదే విధంగా పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పి కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.