Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

యువత మేలుకో మత్తులో భవిష్యత్తును బలి చేసుకోవద్దు

Author
Posted By Telangana Vaartha
| 18 Oct 2026, 03:24 PM | తాజావార్తలు Flash News
యువత మేలుకో మత్తులో భవిష్యత్తును బలి చేసుకోవద్దు

చేతిలో పుస్తకం పట్టాల్సిన వయసులో మత్తు పదార్థాలకు ఆకర్షితులవడం.. జీవితానికి లక్ష్యం నిర్దేశించుకోవాల్సిన దశలో చెడు వ్యసనాలకు బానిసలవడం, తల్లిదండ్రుల ఆశలను, తమ భవిష్యత్తును చేజేతులా దూరం చేసుకోవడం ఆందోళన కలిగించే పరిణామాలు. ఏడో తరగతి నుంచి ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు చదువును మధ్యలోనే ఆపేసిన యువత, విద్యకు దూరంగా ఉంటున్న యువకులు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సైతం మత్తు పదార్థాల ముప్పు బారిన పడకుండా సమాజం పట్ల బాధ్యతాయుతులైన పెద్దలు అప్రమత్తం కావాలి.

-- రాత్రివేళల్లో చీకటి సందుల్లో

యువత గుంపులుగా చేరడం, మద్యం సేవించడం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం, రహదారులపై అల్లరి చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించడం వంటి పరిణామాలను తేలిగ్గా తీసుకోకూడదు. వీరిలో ప్రతి ఒక్కరినీ నేరస్థులుగా ముద్ర వేయడం పరిష్కారం కాదు. వారు ఎందుకు తప్పుదారి పడుతున్నారు? వారి జీవితాలకు సరైన దిశ చూపుతున్నామా? అన్న ప్రశ్నలకు సమాజం సమాధానం వెతకాలి.

యువత మేలుకో మత్తులో భవిష్యత్తును బలి చేసుకోవద్దు - Additional Image

-- చదువుకు దూరమైన యువత

చదువుకు దూరమైన కొందరు యువకులకు ఉపాధి అవకాశాలు లేకపోవడం, జీవితంపై స్పష్టమైన లక్ష్యం లేకపోవడం, చెడు స్నేహాలు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ, సామాజిక మాధ్యమాల్లో కనిపించే తప్పుడు ఆకర్షణలు ప్రమాదకరమైన అలవాట్లకు దారితీసే అవకాశం ఉంది. సరదాగా మొదలైన అలవాటు వ్యసనంగా మారితే ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతినడమే కాకుండా, కొందరు నేరాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

-- యువతకు దిశా నిర్దేశం

ఏడో తరగతి నుంచి విద్యార్థులకు వారి వయసుకు తగిన రీతిలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలను వివరించాలి.ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అదే సమయంలో చదువును మధ్యలో ఆపేసిన యువత, చదువుకు దూరంగా ఉంటున్నవారు, నిరుద్యోగ యువకులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి.

-- విద్య ప్రాముఖ్యత

విద్యార్థులకు విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూనే, చదువుకు దూరమైన యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి మార్గదర్శకత్వం, క్రీడలు, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలి. యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా ప్రోత్సహించాలి. యువకుడి చేతికి పని, మనసుకు లక్ష్యం, జీవితానికి భరోసా లభిస్తే అతడు తన భవిష్యత్తును తానే నిర్మించుకోగలడు.

ఇవి కూడా చదవండి

-- తల్లిదండ్రుల పాత్ర

పిల్లలు పాఠశాలకు వెళ్తున్నా, కళాశాలలో చదువుతున్నా, చదువు మానేసి ఇంటి వద్ద ఉంటున్నా వారి జీవితాలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి. ఎవరితో స్నేహం చేస్తున్నారు? సమయాన్ని ఎలా గడుపుతున్నారు? ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? అనే విషయాలను ప్రేమతో తెలుసుకోవాలి. రాత్రివేళల్లో ఆలస్యంగా ఇంటికి వస్తే కారణం అడగాలి. అది అనుమానం కాదు.. వారి భవిష్యత్తుపై బాధ్యత. యువత ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వారిని అవమానించకుండా, నిందించకుండా సమస్యను అర్థం చేసుకోవాలి. అవసరమైతే కౌన్సెలింగ్‌, వైద్య సహాయం అందించాలి. చదువులో వెనుకబడినా, ఉద్యోగం రాకపోయినా, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినా మత్తు పదార్థాలే పరిష్కారం కావని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

--- జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ

జిల్లా ఎస్పీ పి. శబరీష్ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘మా ఊరు–మా బాధ్యత’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భద్రతపై బాధ్యతను పెంపొందించాలి. పోలీసు శాఖ పాఠశాలలు, కళాశాలలతో పాటు యువజన సంఘాలు, కాలనీలు, గ్రామాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. చదువుకు దూరమైన యువతను గుర్తించి వారిని సానుకూల కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి.
మత్తు పదార్థాల విక్రయాలు, సరఫరాపై నిఘా పెంచి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. నేరాల నివారణకు మహబూబాబాద్ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రధాన కూడళ్లు, అంతర్గత వీధులు, నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసుల గస్తీ పెంచాలి. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థి అయినా, ఉన్నత విద్య అభ్యసిస్తున్న యువకుడైనా, చదువు మానేసిన వ్యక్తి అయినా, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగి అయినా.. ప్రతి ఒక్కరి జీవితానికి విలువ ఉంది. తప్పు చేసే పరిస్థితులకు దారితీస్తున్న కారణాలను గుర్తించి, అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే, యువతకు మార్పు చెందేందుకు అవకాశాలు కల్పించాలి.

-- పోలీసులు నిఘా పెంచాలి

విద్యాశాఖ అవగాహన కల్పించాలి

తల్లిదండ్రులు బాధ్యతతో వ్యవహరించాలి

విద్యాసంస్థలు మార్గనిర్దేశం చేయాలి.. ప్రజాప్రతినిధులు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలకు తోడ్పడాలి. సమాజంలోని ప్రతి వర్గం కలిసికట్టుగా ముందుకు వస్తేనే యువతను మత్తు పదార్థాల ముప్పు నుంచి కాపాడగలం.యువత చెడ్డది కాదు.. దారి చూపాల్సిన బాధ్యత మనందరిది! చదువుతున్న విద్యార్థిని కాపాడటం ఎంత ముఖ్యమో, చదువుకు దూరమైన యువకుడికి కొత్త దారి చూపడం కూడా అంతే ముఖ్యం. దేశంలొ యువత బాధ్యత కీలకం యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.