🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 November 2026, 12:15 am Posted by : Telangana Vaartha

మొరుసు తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలి

News Image
- చలితో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం.
- రైతులు కోసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి.
- విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లకు దూరంగా ఉండాలి.
- అత్యవసరమైతే తప్ప వర్షాల సమయంలో ప్రయాణాలు చేయవద్దు.
- అత్యవసర సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలి.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొరుసు తుఫాను ప్రభావం సూర్యాపేట జిల్లాపై ఉండే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూచించారు. వాతావరణ పరిస్థితుల ప్రకారం రేపు రాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము వరకు తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని, భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
రైతులు పాటించాల్సిన సూచనలు:
1. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకు కొత్తగా వరి కోతలు ప్రారంభించవద్దు.
2. ఇప్పటికే కోసిన ధాన్యం వర్షానికి తడవకుండా టార్పాలిన్లతో పూర్తిగా కప్పి రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి.
3. మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
4. ధాన్యాన్ని మార్కెట్లకు తరలించే సమయంలో వర్షం, ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
5. బలమైన గాలులు, వర్షాలు ఉన్న సమయంలో వ్యవసాయ పనులకు వెళ్లవద్దు.
ప్రజలు పాటించాల్సిన సూచనలు:
1. బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమీపంలో ఉండవద్దు.
2. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పాత భవనాలు, ప్రమాదకర నిర్మాణాలకు దూరంగా ఉండాలి.
3. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. చెట్ల కింద ఆశ్రయం పొందరాదు.
4. విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతాలకు వెళ్లవద్దు. వాటిని తాకే ప్రయత్నం చేయవద్దు.
5. అత్యవసరమైతే తప్ప వర్షాలు, ఈదురుగాలులు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణాలు చేయవద్దు.
6. రహదారులు, కల్వర్టులు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఉన్నప్పుడు దాటే ప్రయత్నం చేయవద్దు.
7. ఇంటి పరిసరాల్లో ఉన్న ప్రమాదకర వస్తువులు, తేలికపాటి సామగ్రి గాలులకు ఎగిరిపోకుండా భద్రపరచుకోవాలి.
8. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలి.
తుఫాను ప్రభావంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు.
ప్రజల ప్రాణ రక్షణే మా లక్ష్యం – ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి.
🏠 Home