🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 01 November 2026, 11:54 pm Posted by : Telangana Vaartha

మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

News Image
కొత్త సభ్యులను చేర్పిస్తే భారీ కమిషన్లు వస్తాయనే ఆశతో మోసపోవద్దు.
ప్రజల కష్టార్జిత సంపాదనను కాపాడుకోవాలి – ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్.
సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా ప్రజలు మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM), చైన్ మార్కెటింగ్ పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో, సరైన వివరాలు తెలుసుకోకుండా ఇలాంటి పథకాలలో పెట్టుబడులు పెట్టి కష్టార్జిత సంపాదనను కోల్పోవద్దని హెచ్చరించారు.
జిల్లాలో కొంతమంది వ్యక్తులు ఎలక్ట్రిక్ బైక్‌లు, మాగ్నెటిక్ పరుపులు, మ్యాజిక్ వాటర్ బాటిళ్లు, మ్యాజిక్ రిస్ట్ బ్యాండ్లు, టూ వీలర్లు, ఫోర్ వీలర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు తదితర వస్తువుల పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ విధానాన్ని ఉపయోగించుకుని ప్రజలను ఆకర్షిస్తున్నట్లు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిందని తెలిపారు. వస్తువుల అసలు మార్కెట్ విలువ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ, వాటిని కొనుగోలు చేస్తే సంస్థలో సభ్యత్వం కల్పిస్తామని, అనంతరం మరో ముగ్గురు కొత్త సభ్యులను చేర్పిస్తే భారీ మొత్తంలో కమిషన్లు వస్తాయని ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. మరింత మందిని చేర్పించిన కొద్దీ ఆదాయం పెరుగుతుందని నమ్మబలుకుతున్నారని తెలిపారు. ప్రారంభంలో కొంతమందికి కమిషన్లు చెల్లించి నమ్మకం కలిగించి, మరింత ఎక్కువ మంది నుంచి డబ్బులు వసూలు చేసిన అనంతరం చెల్లింపులు నిలిపివేయడం, కార్యాలయాలు మూసివేసి నిర్వాహకులు అందుబాటులో లేకుండా పోవడం వంటి పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ఎస్పీ హెచ్చరించారు. కొన్ని సంస్థలు ప్రారంభం కాకముందే తమ సంస్థ త్వరలో ప్రారంభమవుతుందని, ముందుగా సభ్యత్వం లేదా డిపాజిట్ చెల్లిస్తే భవిష్యత్తులో భారీ కమిషన్లు వస్తాయని ప్రచారం చేస్తూ డబ్బులు సేకరిస్తున్నట్లు కూడా సమాచారం ఉందని తెలిపారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. కొత్త సభ్యులను చేర్పిస్తే భారీ కమిషన్లు వస్తాయని చెప్పే చైన్ మార్కెటింగ్ పథకాలను నమ్మవద్దు.
2. వస్తువుల అసలు మార్కెట్ విలువను తెలుసుకోకుండా అధిక ధరలకు కొనుగోలు చేయవద్దు.
3. సంస్థ రిజిస్ట్రేషన్, చట్టబద్ధమైన అనుమతులు, వ్యాపార విధానం, చెల్లింపుల నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి.
4. అధిక లాభాల ఆశతో అప్పులు చేసి లేదా ఆస్తులు విక్రయించి పెట్టుబడులు పెట్టవద్దు.
5. సోషల్ మీడియా ప్రకటనలు, ప్రచార వీడియోలు, ఆకర్షణీయమైన హామీలను గుడ్డిగా నమ్మవద్దు.
6. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కూడా ఇలాంటి అనుమానాస్పద పథకాలలో చేర్పించవద్దు.
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో నిర్వహించే ప్రతి వ్యాపారం చట్టవిరుద్ధం కాదని, అయితే వాస్తవ ఉత్పత్తుల విక్రయాల కంటే కొత్త సభ్యులను చేర్పించడం, వారి నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రధాన ఆదాయ మార్గంగా ఉన్న పథకాల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరమని ఎస్పీ స్పష్టం చేశారు.
మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయాలి:
ఇప్పటికే ఇలాంటి పథకాలలో డబ్బులు చెల్లించి మోసపోయిన వారు ఏమాత్రం భయపడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. సభ్యత్వ రసీదులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, వాట్సాప్ సందేశాలు, ప్రచార వీడియోలు, ఇతర ఆధారాలను పోలీసులకు అందించాలని కోరారు. ఇలాంటి సంస్థల నిర్వాహకులు లేదా అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వారు కూడా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ తరహా కార్యకలాపాలపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో విచారణ చేపడుతోందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజల ఆర్థిక భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం. ప్రజల అప్రమత్తతే ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే అత్యాశకు లోనుకాకుండా, మీతో పాటు ఇతరులు కూడా మోసపోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
🏠 Home