షటిల్ క్రీడాకారుల కోసం ఉచిత గుండె వైద్య శిబిరం.
సూర్యాపేట:- నిత్యం తమతో కలిసి షటిల్ ఆడుతూ, నవ్వుతూ, సరదాగా గడిపిన తోటి క్రీడాకారుడు వెలుగు కర్ణాకర్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందడం సహచర క్రీడాకారులను తీవ్ర విషాదానికి గురిచేసింది. కళ్లముందే తిరిగిన ఆత్మీయ క్రీడాకారుడు ఇక లేడనే వార్త అందరినీ కలచివేసింది. ఇలాంటి విషాదకర పరిస్థితి మరే క్రీడాకారుడి కుటుంబంలోనూ చోటుచేసుకోకూడదనే మానవీయ ఆలోచనతో గాయత్రి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డా. ఊర రామమూర్తి యాదవ్ ముందడుగు వేశారు. తోటి క్రీడాకారుల ఆరోగ్యమే తన ఆరోగ్యంగా భావిస్తూ, షటిల్ ఆడే ప్రతి ఒక్కరూ గుండె సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్వీ ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి షటిల్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. డా. ఊర రామమూర్తి యాదవ్ (Dr Voora Ramurthi Yaday) ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు నిర్వహించారు. గుండె వైద్య నిపుణులు డా. అలక ప్రేమ్ కుమార్ క్రీడాకారులను పరీక్షించి, వారి ఆరోగ్య పరిస్థితిపై తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా డా.ఊర.రామమ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ ఒక తోటి క్రీడాకారుడిని కోల్పోయిన బాధ నుంచి పుట్టిన ఈ ఆలోచన.. మరెంతోమంది క్రీడాకారుల ప్రాణాలకు భరోసా కల్పించే మంచి ప్రయత్నంగా నిలిచిందన్నారు. క్రీడలతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, గుండె సంబంధిత పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదనే సందేశాన్ని ఈ శిబిరం అందించిందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన ఆర్వీ హాస్పిటల్ నిర్వాహకులు డా.అలక ప్రేమ్ కుమార్ కు డా.ఊర రామమ్మూర్తి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తోటి క్రీడాకారుడి జ్ఞాపకార్థం, ఇతరుల ప్రాణాల పట్ల బాధ్యతతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డా. ఊర రామమూర్తి యాదవ్ ను పలువురు అభినందించారు. వారు చేస్తున్న సేవలను కొనియాడారు.