657 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 319 ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో మరో 657 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. శనివారం సూర్యాపేటలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి, 100 రోజుల్లో పూర్తి చేసుకోవాలని సూచించారు. 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. బేస్మెంట్, లింటెల్, రూఫ్ లెవల్ దశల్లో నిర్మాణ పురోగతిని బట్టి విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ప్రతి దశలో నిర్మాణ ఫొటోలను అధికారులకు అందజేయాలని సూచించారు. వచ్చే జనవరి 26 నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకునేలా లబ్ధిదారులు కృషి చేయాలని కోరారు. ఇందుకు జిల్లా యంత్రాంగం, మున్సిపల్, హౌసింగ్ అధికారులు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. ఇళ్ల మంజూరు, నిర్మాణాల్లో అక్రమాలు, అవకతవకలను సహించబోమని హెచ్చరించారు.
పేదల సొంతింటి కల నిజం చేస్తాం
ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్నదే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యాద అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీకి 657 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో పథకం అమలవుతోందని చెప్పారు. గతంలో మాజీ మంత్రి దివంగత దామోదర్ రెడ్డి హయాంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో నివసిస్తున్న వారు ఇప్పటికీ సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇళ్లు మంజూరైన వారు కూడా నాణ్యమైన ఇళ్లు నిర్మించుకుని కుటుంబాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఇళ్ల నిర్మాణాలతో మేస్త్రీలు, కూలీలు, పెయింటర్లు, నిర్మాణ సామగ్రి వ్యాపారులకు ఉపాధి లభిస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని తెలిపారు.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కొత్త పెన్షన్ల కోసం సుమారు 3,100 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని, అర్హులకు త్వరలో పెన్షన్లు అందిస్తామని వెల్లడించారు. అర్హులైన పేదలు, వృద్ధులకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో టూరిజం శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎఐసిసి సభ్యులు సర్వోత్తమ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వీణరెడ్డి, పిడి హౌసింగ్ జబ్బర్ మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీఉల్లా, ఎఎంసి వైస్ చైర్మన్ గట్టు శ్రీను, ఫ్లోర్ లీడర్ వేణు గోపాల్, వెలుగు వెంకన్న కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు