అన్నం మెతుకుపైనా అక్రమ వ్యాపారం!
పేదోడి బువ్వపై వ్యాపారుల పంజా.. సన్నబియ్యం ధరలకు రెక్కలు!
ఎల్‌నినో ప్రభావం.. సరఫరా సమస్యలు.. ధరల పెరుగుదల.. నిల్వలపై అనుమానాలు – సామాన్యుడి కంచంలో కల్లోలం!
నారు పోసింది రైతు.. నీరు పెట్టింది రైతు.. కలుపు తీసింది రైతు.. ఎరువులు వేసింది రైతు.. పంటను కంటికి రెప్పలా కాపాడింది రైతు.. చివరకు ధాన్యం పండించి మార్కెట్‌కు తీసుకొచ్చింది కూడా రైతే! కానీ ఆ ధాన్యానికి ధర నిర్ణయించే అధికారం మాత్రం రైతు చేతిలో లేదు. బియ్యం కొనుగోలు చేసే సామాన్యుడికి కూడా ధరపై నియంత్రణ లేదు. మధ్యలో ఉన్న వ్యాపార వ్యవస్థే ధరలను ప్రభావితం చేస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సామాన్యుడి బువ్వకు సెంచరీ సెగ!
ఒకప్పుడు పేదవాడి ఇంట్లో అన్నం ఉంటే అదే పెద్ద సంపద. కాలం మారింది.. ఆహారపు అలవాట్లు మారాయి. గతంలో జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు వంటి చిరుధాన్యాలు పేదల ప్రధాన ఆహారంగా ఉండేవి. ఇప్పుడు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా బియ్యమే ప్రధాన ఆహారంగా మారింది. అలాంటి బియ్యం ధరలు పెరుగుతుండటంతో నెలవారీ కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోంది. ముఖ్యంగా సన్నబియ్యం ధరలు సామాన్య కుటుంబాలకు భారంగా మారుతున్నాయి.
తెలంగాణలో 2026 అక్టోబర్‌లో వెలువడిన వార్తా కథనాల ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో సన్నబియ్యం కిలో ధర రూ.80–90 వరకు చేరినట్లు నివేదించారు. కొన్ని రకాల బియ్యం ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే బియ్యం రకం, నాణ్యత, ప్రాంతం, రవాణా ఖర్చులను బట్టి ధరల్లో తేడాలు ఉంటాయి.
ఎల్‌నినో పేరుతో ధరల భయాలు!
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం తగ్గే అవకాశం వంటి అంశాలు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతాయి. 2026 నైరుతి రుతుపవనాల విషయంలో భారత వాతావరణ శాఖ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే వాతావరణ పరిస్థితులను సాకుగా చూపి ముందుగానే బియ్యం కొరత వస్తుందని ప్రచారం చేయడం, ధరలు పెంచడం సరైన పద్ధతి కాదు.
కొన్ని ప్రాంతాల్లో సన్నబియ్యం సరఫరా తగ్గడం, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు పెరగడం, పండుగల సమయంలో డిమాండ్ అధికం కావడం వంటి కారణాలు కూడా ధరల పెరుగుదలకు దోహదపడవచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించకుండా మొత్తం భారాన్ని ఎల్‌నినోపై నెట్టడం సమంజసం కాదు.
నిల్వలున్నాయా? కొరత ఉందా? అధికారుల తనిఖీలేవి?
ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం, 2026 జనవరి 27 నాటికి కేంద్ర నిల్వల్లో 331.52 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నట్లు పార్లమెంటులో వెల్లడించింది. మే 28 నాటికి కేంద్ర నిల్వల్లో 397 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, మిల్లింగ్ కోసం ఎదురుచూస్తున్న సుమారు 298 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు మరో అధికారిక ప్రకటన తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిల్వలు ఉండటం ఒక్కటే స్థానిక మార్కెట్లో ప్రతి రకం సన్నబియ్యం సరిపడా అందుబాటులో ఉందని నిరూపించదు.
అయినా మార్కెట్లో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మిల్లుల్లో, గోదాముల్లో ఉన్న నిల్వలు ఎంత? వ్యాపారులు ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారు? వినియోగదారులకు ఎంతకు విక్రయిస్తున్నారు? బియ్యం సరఫరాలో ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
రైతుకు గిట్టుబాటు ధర ఏది?
వరి సాగు చేయడం అంటే రైతుకు ఎన్నో నెలల శ్రమ, పెట్టుబడి, అప్పులు, ప్రకృతి వైపరీత్యాలతో పోరాటం. విత్తనాల నుంచి కోత వరకు ప్రతి దశలో ఖర్చులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ పంట చేతికి వచ్చిన తర్వాత రైతు ఆశించిన ధర దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కనీస మద్దతు ధర ప్రకటించినా, రైతుకు వాస్తవంగా ఎంత ధర లభిస్తోంది? మధ్యవర్తుల పాత్ర ఎంత? ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం రావాలి.
రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించాలి. అదే సమయంలో వినియోగదారుడికి సరసమైన ధరకు బియ్యం అందాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, కొనుగోలు సంస్థలు, మార్కెట్ వ్యవస్థపై ఉంది.
బియ్యం వ్యాపారంపై నిఘా ఎక్కడ?
బియ్యం ధరల పెరుగుదలకు అక్రమ నిల్వలు, సిండికేట్లు లేదా కృత్రిమ కొరత కారణమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులు వాటిని వాస్తవాలతో నిర్ధారించాలి. గోదాముల నిల్వల వివరాలు సేకరించడం, కొనుగోలు–అమ్మకాల రికార్డులను పరిశీలించడం, తూకాల్లో మోసాలు జరగకుండా చూడటం, అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం అవసరం.
అన్నం అనేది వ్యాపార వస్తువు మాత్రమే కాదు.. ప్రతి మనిషి జీవనాధారం! రైతు చెమటకు విలువ రావాలి.. పేదవాడి కంచంలో అన్నం తగ్గకూడదు. ధాన్యం పండించే రైతు నష్టపోకుండా, బియ్యం కొనుగోలు చేసే సామాన్యుడు అప్పులపాలు కాకుండా ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి.
అధికారులూ.. జర దేఖో సార్లూ!
బియ్యం నిల్వలు, మార్కెట్ ధరలు, సరఫరా వ్యవస్థపై సమగ్ర పరిశీలన జరిపి, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి. అన్నదాతకు న్యాయం.. సామాన్యుడికి అందుబాటు ధర.. ఇదే ప్రజల ఆకాంక్ష!
చర్లపల్లి గిరీష్ కుమార్.
(M.A Social Work & MA in Journalism and Mass Communication. సీనియర్ జర్నలిస్ట్, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు.)