🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 8:40 pm Posted by : Telangana Vaartha

అన్నం మెతుకుపై అక్రమ *వ్యాపారం - పేదోడి

News Image
బువ్వపై పెద్దల దందా..!
*
ఎల్ నినో బూచి- సామాన్యుడి కంచంలో చిచ్చు- నన్నబియ్యం సెంచరి ఉచ్చు-సరిపడా నన్నాలున్నా దాచి దోచుకుంటున్న బియ్యం మిల్లర్లు.. వ్యాపారులు...!


నారు పోసినోడు కాదు... *నీరు పెట్టినోడు కాదు... కలుపు తీసినోడు కాదు... *ఎరువేసినోడు కాదు... కోత కోసినోడు కాదు...పంటను కన్నబిడ్డలా సాకినోడు అంతకన్నా కాదు..*దర వ్యాపారులే నిర్ణయించి దాన్యాన్ని అగ్గువనగ్గువకు లాగేనుకున్నరు...!
బియ్యం కావాలని పోతే రేటు వ్యాపారులే *నిర్ణయించి
దోచుకుంటుండు ఇదేమి*చోద్యం... ఇదేమి రాజ్యం...!

వడ్లకు రేటు ఉండదు...బియ్యం రేటుకు అంతు ఉండదు... పత్తికి రేటు ఉండదు... పరుపులకు, బట్టలకు రేటు కొనడానికి అందదు...రైతు అమ్మితే రేట్లు వ్యాపారులు నిర్ణయించి తక్కువకు కొంటారు...ముడి నరుకు రూపు రేఖలు మార్చి రేట్లు వ్యాపారులే నిర్ణయించి ముడ్డిమీదతంతరు.. ఇంకెన్నాళ్లు అన్నదాతల అరిగోస...!

వానాకాలం సీజన్లో వరి రికార్డు ఉత్పత్తి - గత వానాకాలం బియ్యం అమ్ముతున్నా రేట్లు అందనంత ఆకాశంలో....!

పాలకులెందరు మారినా మారని పాలితుల బతుకులు - నీరు లేక కన్నీరుతో పండించినా రైతుల బాధలు వర్ణనాతీతం...!

అధికారులు జర దేఖో సార్లూ...!!


✍️డాక్టర్ కృష్ణ బంటు, పిహెచ్డ్& గోల్డ్ మెడలిస్ట్ ఇన్ జర్నలిజం, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత

అన్నం మెతుకుపై అక్రమ వ్యాపారులు కన్నేశారు. తమ అధిక సంపాదనకు అడ్డాగా పేదోడి బువ్వను మార్చుకున్నారు. వెనుకటికి అయితే మొదట్లో రాజులు, తర్వాత దొరలు, భూస్వాములు, ధనికులు అన్నాన్ని తినేవారు. గతంలో పేదలు జొన్న, రాగి, సద్ద, తైదల సంగటి తినేవారు. అన్నం దొరికితే మహాబాగ్యం. కాలక్రమేణా వచ్చిన మార్పులతో ఇప్పుడు వరి అన్నాన్ని పేదలు తింటు ధనికులు మాత్రం చిరు దాన్యాలు, సిరి దాన్యాలు అరికెలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఊదలు, వరిగెలు, అండుకొర్రలు, సామలు తింటూ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. పేదలు, మధ్యతరగతి వారు ఎక్కువగా తినే బియ్యం ప్రస్తుతం మార్కెట్లో సెంచరీ దాటి సామాన్య జనాలు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. అడ్డు అదుపు లేకుండా బియ్యం వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో రేట్లు పెంచుకుంటూ ప్రస్తుతం కిలో సన్న బియ్యం రేటు సెంచరీ దాటించారు. వ్యాపారుల దోపిడీకి, ఆశకు అంతులేకుండా పోయింది. ఇలా చేసిన అక్రమ సంపాదన బియ్యాన్ని దాచుకో, రేట్లను పెంచుకో, ప్రజలను దోచుకో అన్న రీతిలో భయంకరంగా దోపిడీకి పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు. వినవస్తున్నాయి. ఎవరు ఎంత ఎగిరినా, ఎంత అక్రమ సంపాదన సంపాదించినా చిల్లి గవ్వ కూడా తనతో తీసుకుపోలేని తాత్కాలికమైన ఈ జీవితానికి ఎందుకంత అత్యాశ దుస్థితి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఈ భూగ్రహంపై ప్రతి వ్యక్తి కూడా ఒక టూరిస్ట్ గా వచ్చాము తప్పించి భూమిపై శాశ్వతంగా ఉండటానికి కాదన్న జీవిత సత్యాన్ని ప్రతివారు తెలుసుకుంటే, ఎవరి టూరిస్ట్ వీసా ముగిసిపోతే భూగ్రహాన్ని వదిలిపెట్టి వెళ్లడం తప్పదన్న సత్యాన్ని కూడా గ్రహించాలని, అప్పుడే మనిషి తోటి మనిషిని గౌరవించే ఒక మానవతా హృదయం ఉంటుందనేది మేధావులు, విజ్ఞులు, విజ్ఞానవంతులు పేర్కొనే నిత్య సత్యం.


ఎల్నినో బూచి చూపి దోచుకుంటున్న బియ్యం మిల్లర్లు, వ్యాపారులు


ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ప్రకృతిలో ఎల్నినో ప్రభావం తదితర అంశాలను బూచిగా చూపి బియ్యం మిల్లర్లు, వ్యాపారులు బియ్యం అక్రమ దందాకు తెరలేపారు. సన్న బియ్యం దొరకడం లేదని, భవిష్యత్లో మరింతగా కొరత ఉంటుందని లేనిపోని భయాలను ప్రచారం చేసి తాము అనుకున్నకాడికి రేట్లు ఇష్టారాజ్యంగా పెంచి ప్రస్తుతం బియ్యం రేటును కిలో వంద రూపాయలకు పెంచి సామాన్యుడిని దోచుకుంటున్నారు. సన్నబియ్యానికి కృత్రిమ కొరత సృష్టించడంతో వ్యాపారులు తమ జేబులలో మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నారు. బియ్యంను బ్లాక్ చేసి రేట్లను పెంచి అక్రమ దోపిడికి తెరలేపడంతో సామాన్యుల బతుకుల్లో గుబులు మొదలైంది. ధాన్యం దండిగా ఉన్నప్పటికి బియ్యం ధరలకు రెక్కలు ఎలా వచ్చాయో, ఎందుకు
వచ్చాయో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. బియ్యం వ్యాపారుల అక్రమ దందాలో సన్నబియ్యం ధరల మంట గ్యాస్ స్టవ్, పొయ్యిల మీద సలసల కాగుతుంది. బియ్యం వ్యాపారుల ధరల ఇష్టారాజ్యంతో సామాన్య ప్రజలకు భారంగా మారింది. సన్న బియ్యం బహిరంగ మార్కెట్లో ఒక బంగారంలా మారడంతో అన్నం సామాన్య ప్రజలకు అందకుండా పోతుంది. కడుపు నిండా తిన్నది లేదు. బియ్యం రేట్లతోని నిద్ర కూడా సగటు మనిషికి కరువైందని చెప్పవచ్చు. సన్న బియ్యంపై వ్యాపారుల కన్ను పడడం, తమ అడ్డగోలు సంపాదనకు ఒక మార్గంగా ఉడడంతో వ్యాపారుల దోపిడి పరాకాష్టకు చేరుకుంది. బియ్యం బస్తాల్లోకి చేరిన బ్లాక్ దందాతో ఇష్టవచ్చినట్టుగా సిండికేట్గా మారి రేట్లు వ్యాపారులు జోరుగా పెంచుతున్నారు. గోదాముల్లో కావాల్సినంత నిల్వలున్నప్పటికీ మార్కెట్లో బియ్యం ఎందుకు మండుతున్నాయో, ఎందుకు కుతకుత ఉడుకుతున్నాయో అర్ధం కాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. సన్నబియ్యం సాకుతో జరుగుతున్న వ్యాపారుల సొమ్ముల వేట ఇంకెంతకాలం. వ్యాపారులు అడ్డగోలు ధరల ఆటలకు సామాన్యులు బలవుతున్నారు. అడ్డు అదుపూ లేని బియ్యం ధరలను అధికారులు ఎందుకు నియంత్రిచడం లేదో, వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్టలు ఎందుకు అదికారులు వేయడంలేదో, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అని సామాన్యుడు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారుల మౌనపాత్ర ఇంకెంతకాలమని, ధరల నియంత్రణలో అధికారులు విఫలమయ్యారని, బియ్యం వ్యాపారలు అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేవారు ఎక్కడ అని, వ్యాపారుల దంధాపై నిఘా ఎక్కడని పలువురు ప్రశ్నిస్తున్నారు.


బహిరంగ మార్కెట్లో, గోదాముల్లో సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ ఎందుకీ ధరల పెంపు


ఎల్నినో ప్రభావం ఇప్పటికిప్పుడు ఈ దాన్యం సీజన్పై లేనప్పటికీ వ్యవసాయమే తెలియని వ్యాపారులు మాత్రం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు అమ్మే బియ్యం గత వానకాలం సీజన్. గత సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయ్యింది. గోదాముల్లో, బహిరంగ మార్కెట్లో సరిపడా నిల్వలున్నాయి. అనేక మిల్లులలో దాన్యపురాశులు గలగల లాడుతున్నాయి. అయినప్పటికి ఎల్నినో బూచి చూచి బియ్యాన్ని బ్లాక్ చేసిన వ్యాపారులు సన్నబియ్యం ధరలను సెంచరీ దాటించారు.


కన్నీరే నీరుగా కష్టిస్తున్న రైతన్నలు


ఎల్నిలో ప్రభావం వాస్తవానికి రాబోయే ఈ సీజన్పై పడుతుంది. వరి పంటను పండించాలంటే ఎంత కష్టముంటదో రైతన్నలకు మాత్రమే తెలుసు. బురద నుంచి తెల్లటి బువ్వను ఇస్తున్న రైతన్నలు తమ ఉత్పత్తులకు మద్దతు ధర, అసలు గిట్టుబాటు ధర కూడా ఏ పాలకులు ఇవ్వలేదు. బహుశా భవిష్యత్లో కూడా ఇవ్వరేమో. పాలకులు ప్రకటించే మద్దతు ధర కూడా అరకొర పెంపు మాత్రమే. అయితే ఎన్నో సాకులు చూసి మద్దతు ధర కంటే చాలా తక్కువకు వడ్లు వ్యాపారులు కొనడం షరామామూలే. గిట్టుబాటు ధర ఇంకెక్కడి నుంచి వస్తది. ఏదన్నా తయారీదారు తన ఉత్పత్తికి తానే ధర నిర్ణయిస్తాడు. ఎనబైఏళ్ల స్వతంత్ర భారతంలో రైతు మాత్రం తన ఉత్పత్తులకు కొనుగోలుదారు నిర్ణయించిన రేటుకు అమ్ముకునే దుస్థితి నెలకొంది. తక్కువ ధరకు వడ్లు కొనడం, బియ్యంగా మార్చి దళారి వ్యవస్థ వలన రేట్లు బియ్యం అమ్మేవారే నిర్ణయించడం మన దౌర్భాగ్యం. రైతు తన వడ్లకు రేటు నిర్ణయించేదిలేదు, వ్యాపారి మాత్రం బియ్యంకు రేటు నిర్ణయించవచ్చు ఎలాంటి ప్రజాసామ్య వ్యవస్థలో ఉన్నాం మనం. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా... రైతన్నకు, బియ్యం పేరుతో సామాన్యులకు జరిగే ఈ దళారి వ్యవస్థ దోపిడి పాలకులకు తెలియదా... తెలిసినా మిన్నకుండడంలో ఉన్న అర్ధం, పరమార్ధం ఏమిటో తెలుసుకోలేనంత వరకు అన్నదాతల పరిస్థితి అట్టడుగున అలాగే పడి ఉంటుందేమో. ఇంకెంతమంది పాలకులు మారినా
రైతుల దోపిడికి అంతం ఉండదనేది నగ్నసత్యం. ఇలాంటి దుర్భర పరిస్థితులు తట్టుకోలేక ఒకవైపు, బియ్యం వ్యాపారులు దళారుల ఆగడాలు తట్టుకోలేక మరొకవైపు, దళారి వ్యవస్థ నిర్మూలించలేక ఇంకొక వైపు అసలు వ్యవసాయమే చేసే రైతులు ఇప్పటికే చాలా తగ్గిపోయారు, భవిష్యత్తులో ఇంకా తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది అని సమాజం ప్రశ్నిస్తుంది.


అధికారులూ...జర దేఖో సార్లూ...!


ప్రస్తుతం బియ్యం విషయంలో జరుగుతున్న బ్లాక్ మార్కెట్ దందా, అడ్డగోలు అధిక రేట్ల విషయంలో సంబంధిత అధికారులు జిల్లా వ్యాప్తంగా కొరడా ఝళిపించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వ్యాపారుల అడ్డగోలు అక్రమ దందాకు చరమగీతం పాడాలని, బియ్యం రేట్లను సామాన్యుడికి అందుబాటులోనికి తేవాలని కోరుతున్నారు. ఈ విషయంలో సంబంధింత అధికారులు తక్షణ చర్యలు చేపట్టి అక్రమ వ్యాపారులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారని మనమూ ఆశిద్దాం.
🏠 Home