మహిళలకు ఇన్స్టంట్ పెన్షన్ సదుపాయం.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా లో పింఛన్ లబ్ధిదారుడైన భర్త మరణించినప్పుడు ఆయన భార్యకు తక్షణ పెన్షన్ అందించే ఇన్స్టంట్ పెన్షన్ సదుపాయాన్ని అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. పెన్షన్ పొందుతున్న భర్తలు మరణించిన సందర్భాల్లో వారి భార్యలకు తక్షణమే సామాజిక భద్రతా పెన్షన్ మంజూరు చేసే ఇన్స్టంట్ పెన్షన్ సదుపాయాన్ని ప్రభుత్వం మరిన్ని పింఛన్ కేటగిరీలకు విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారo,వృద్ధాప్య పింఛన్తో పాటు దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్ఐవీ (యాంటీ రెట్రోవైరల్ థెరపీ), ఫైలేరియా పింఛన్ లబ్ధిదారుల భార్యలకు కూడా ఇన్స్టంట్ పెన్షన్ సదుపాయాన్ని తాజాగా ప్రభుత్వం విస్తరించిందన్నారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా కుటుంబానికి అందుతున్న సామాజిక భద్రత సహాయం నిలిచిపోకుండా కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మరణించిన పురుష పెన్షన్ లబ్ధిదారుడి భార్య వయస్సు 57 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే వితంతు పెన్షన్, 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలోని బిల్ కలెక్టర్కు దరఖాస్తుతో పాటు తమ ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ, మరణించిన పింఛన్ లబ్ధిదారుడి ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ సమర్పించాలని సూచించారు. సంబంధిత అధికారులు అర్హులైన వారు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హతను ధ్రువీకరించిన అనంతరం చేయూత పోర్టల్లో వివరాలను నమోదు చేసి నిబంధనల ప్రకారం పెన్షన్ మంజూరు చేస్తారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తు గడువు లేదా నిర్దిష్ట విడత కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరణించిన పెన్షన్ లబ్ధిదారుల కుటుంబాల వివరాలను సకాలంలో సేకరించి, నిర్దేశించిన 15 రోజుల గడువులోగా చేయూత పోర్టల్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన మహిళలకు సామాజిక భద్రతా పెన్షన్లు నిరంతరాయంగా అందేలా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. భర్తను కోల్పోయిన మహిళలకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించే ఈ సదుపాయాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.