సెల్‌ఫోన్ వాడకంపై గొడవ.. కన్నకూతురినే హత్య చేసిన తల్లి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు హనుమాన్ కాలనీకి చెందిన ముయ్యడి రాజు, విజయలక్ష్మి దంపతుల కుమార్తె సువర్చల (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
బాలిక తరచూ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండటంతో తల్లి విజయలక్ష్మి మందలించేదని, ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.
అక్టోబర్ 27న మరోసారి తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన విజయలక్ష్మి తన కుమార్తె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం!
కుమార్తె మృతి చెందిన అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమిన ఆనవాళ్లు బయటపడటంతో కేసు కీలక మలుపు తిరిగింది.
వైద్య నివేదిక ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు విజయలక్ష్మిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం ఆమెను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
షాద్‌నగర్ డీసీపీ సి. శిరీష రాఘవేంద్ర, ఏసీపీ పి. లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కొత్తూరు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు.
కన్నతల్లిపైనే కుమార్తె హత్య ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.