🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 30 October 2026, 8:26 pm Posted by : Telangana Vaartha

జోగులాంబ గద్వాల జిల్లాను సురక్షిత్ ప్లస్ హోదా దిశగా చర్యలు తీసుకోవాలి

News Image
హెచ్‌ఐవీ నివారణలో అంకితభావంతో పనిచేసిన సిబ్బందికి కలెక్టర్ అభినందనలు
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణలో సాధించిన ప్రగతిని కొనసాగించాలి – జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ – సురక్ష కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా సురక్షిత్ హోదా సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

శుక్రవారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందు మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ – సురక్ష కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఐవీ,ఎయిడ్స్ నివారణకు సమన్వయంతో కృషిచేసిన అధికారులు,వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో నివారణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.జిల్లా సాధించిన సురక్షిత్ హోదా ఒక ముఖ్యమైన విజయమని,ఈ గుర్తింపుతో బాధ్యత మరింత పెరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.ఇప్పటివరకు సాధించిన ప్రగతితో సంతృప్తి చెందకుండా,ఇదే స్ఫూర్తి, అంకితభావంతో ముందుకు సాగాలని తెలిపారు.హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా మొబిలైజేషన్ కార్యక్రమాలను విస్తృతం చేయాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వ శాఖలు, వైద్య ఆరోగ్యశాఖ, ఐసీటీసీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయడం ద్వారానే ఆశించిన ఫలితాలను సాధించగలమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, అర్హులైన వారికి పరీక్షలు, కౌన్సెలింగ్,చికిత్స, అవసరమైన సహాయ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా,వారికి గౌరవం, భరోసా కల్పించే విధంగా సమాజంలో అవగాహన పెంపొందించాలని తెలిపారు.
జిల్లా సాధించిన జాతీయ స్థాయి గుర్తింపును స్ఫూర్తిగా తీసుకొని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, జోగులాంబ గద్వాల జిల్లాను సురక్షిత్ ప్లస్ హోదా దిశగా తీసుకెళ్లేందుకు అధికారులు, సిబ్బంది,స్వచ్ఛంద సంస్థలు సమష్టి బాధ్యతతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సురక్షిత్ హోదా సాధనలో విశేష కృషి చేసిన వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది,కౌన్సెలర్లు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బందిని జిల్లా కలెక్టర్ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సంధ్య కిరణ్మయి,జిల్లా ప్రోగ్రాం అధికారి రాజు,దిశ సీపీఎం రమేష్, సీఎస్ఓ రవీంద్ర రెడ్డి,డీఎంఓడీ సాయికుమార్,వైద్య సిబ్బంది, ఐసీటీసీ,పీపీటీసీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home