మైనారిటీ సంక్షేమ శాఖలో అవినీతి, అక్రమ నియామకాలపై చర్యలు ఎప్పుడు
-నియామక ఉత్తర్వులు లేకుండానే ఏళ్ల తరబడి ఉద్యోగం.. ప్రభుత్వ జీతం పొందుతున్నారని ఫిర్యాదు
-ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
-కాంగ్రెస్ నాయకురాలు షబాన మహమ్మద్ ఆరోపణలు...
-జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు.. చర్యలు తీసుకోకుంటే ధర్నా చేస్తామని హెచ్చరిక
కరీంనగర్,అక్టోబర్29(స్టాఫ్ రిపోర్టర్):కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవినీతి, అక్రమ నియామకాలు, కుట్టు మిషన్ల పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హుస్సేన్‌పురా 33వ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు షబానా మహమ్మద్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ బఖ్తియార్ 2017 నుంచి ఎలాంటి అధికారిక నియామక పత్రం లేదా ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఉత్తర్వులు లేకుండానే విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ జీతం పొందుతున్నారని ఆరోపించారు.
పేద, అర్హులైన మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా కుట్టు మిషన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారుల జాబితాలో మార్పులు చేసి, వందలాది మిషన్లను స్నేహితులు, బంధువులు, ఇతరులకు కేటాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీల ఆధారంగా వేర్వేరు పేర్లతో మిషన్లు పంపిణీ చేసి, అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
మహమ్మద్ బఖ్తియార్ అనధికార నియామకం, ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా జీతం పొందుతున్న అంశంపై 2025 జూలైలో ఉన్నతాధికారుల స్థాయిలో విచారణ జరిగినట్లు షబానా మహమ్మద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణలో నియామకం అనధికారికమని తేలడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తనకు తెలిసిందని తెలిపారు. అయినప్పటికీ, ప్రస్తుతం ఆయన అదే కార్యాలయంలో అదే హోదాలో ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. అక్రమంగా ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా మైనారిటీ సంక్షేమ శాఖకు చెందిన కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు.
ఏళ్ల తరబడి అనధికారికంగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ రికార్డుల్లో పేరు నమోదు చేసుకుని జీతం పొందుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని షబానా మహమ్మద్ అన్నారు.
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మైనారిటీ సంక్షేమ శాఖలోని అక్రమ నియామకాలపై, కుట్టు మిషన్ల పంపిణీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరోపణలు రుజువైతే బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
లేనిపక్షంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన చేపడతామని షబానా మహమ్మద్ హెచ్చరించారు.