అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకోవాలి
"రాబోయే ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని నాగారం మండలం బిఆర్ఎస్వి ఉపాధ్యక్షులు చిప్పలపల్లి బాలస్వామి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పట్టభద్రులు తమ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండి, ఉత్తీర్ణులై మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని తెలిపారు.
నమోదు చేసుకోవడానికి అవసరమైన ఫారం-18 (Form-18) ను పూర్తి చేసి, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆన్‌లైన్‌లో లేదా నిర్దేశిత కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువత, విద్యావంతులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటర్లుగా నమోదు చేసుకుని తమ రాజ్యాంగ హక్కును వినియోగించుకొని మన సమస్యలపై గళం ఎత్తే నాయకున్ని ఎన్నుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.