🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 October 2026, 2:00 am Posted by : Telangana Vaartha

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

News Image
ముఖ్యమైన పాయింట్స్:మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి
ఖమ్మం, అక్టోబర్ 25:- జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టడానికి గల కారణాలను మరియు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలో సుమారు 17,600 మంది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత, వేతనాలు, వైద్య సదుపాయాలు, ఇతర సేవా ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించడం , సమాన పనికి సమాన వేతనం అమలు, మహిళలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఈ హెచ్ ఎస్ ద్వారా నగదు రహిత వైద్యం, ప్రతి నెలా 5వ తేదీలోపు జీతాల చెల్లింపు వంటి డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వార్షిక 5 శాతం ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్, 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు, రూ.20 లక్షల గ్రాట్యుటీ, ఉద్యోగి మరణిస్తే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ విధానంపై పునఃపరిశీలన చేసి ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతర ఆరోగ్య సేవలు అందిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను మానవీయ దృక్పథంతో పరిశీలించి, న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు డాక్టర్ మాధవి, రఘురామ్, డాక్టర్ వెంకట్‌లాల్, డాక్టర్ వి.వి.రావు, డాక్టర్ మనోజ్, డాక్టర్ కాశయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home