🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 24 October 2026, 8:40 pm Posted by : Telangana Vaartha

రాష్ట్రంలోని జర్నలిస్టులకు తీపికబురు.. ఇళ్ల స్థలాల పంపిణీపై బిగ్ అప్‌డేట్

News Image
రాష్ట్రంలో ఏళ్లకు ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి చట్టపరమైన చిక్కులు లేకుండా, నివాసయోగ్యమైన ప్రాంతంలో స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని ఇవాళ సచివాలయంలో జరిగిన అధికారుల సమీక్షలో ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 2008లో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి భూములు కేటాయించినప్పటికీ, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రక్రియ నిలిచిపోయిందని మంత్రి గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే, 2024 సెప్టెంబర్ 8న రవీంద్రభారతిలో కార్యక్రమం నిర్వహించి సొసైటీకి భూమిని అప్పగించామని తెలిపారు.
అనంతరం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వుల వల్ల మళ్లీ సమస్యలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి, సహచర మంత్రులతో చర్చించి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు.
జర్నలిస్టులకు భరోసా..
గతంలో వచ్చిన న్యాయపరమైన అడ్డంకులు పునరావృతం కాకుండా, గౌరవప్రదమైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని, జర్నలిస్టులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పొంగులేటి భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, జర్నలిస్టుల సొంతింటి కలను త్వరలోనే సాకారం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
🏠 Home