ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించాలి
సిబ్బంది హాజరు,రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
అక్రమ నీటి కనెక్షన్లను అరికట్టి, అందరికీ నీరు అందించాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జిల్లా ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు నందు జిల్లా మిషన్ భగీరథ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నీటి శుద్ధి ప్రక్రియ,నాణ్యత పరీక్షలు, రసాయనాల వినియోగం,సిబ్బంది హాజరు,రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి,ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్,టర్బిడిటీ, క్లోరిన్ స్థాయిలను నమోదు చేయాలని సూచించారు.ముడినీటి నాణ్యత ఆధారంగా జార్ టెస్టులు నిర్వహించి,అవసరమైన రసాయనాలను సరైన మోతాదులో వినియోగించాలని సూచించారు.
నీటి నాణ్యత పరీక్షలు,రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంపై సంబంధిత ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీతో పాటు బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్లాంటులో సిబ్బంది హాజరును క్రమం తప్పకుండా తనిఖీ చేసి,ఏజెన్సీ చూపిస్తున్న సిబ్బంది సంఖ్యకు,విధుల్లో ఉన్నవారి సంఖ్యకు వ్యత్యాసం లేకుండా చూడాలని ఆదేశించారు.సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను పరిశీలించిన తర్వాతే ఏజెన్సీ బిల్లులు చెల్లించాలని సూచించారు. ప్లాంటులో పనిచేస్తున్న సిబ్బంది అందరి హాజరును మీ ప్రమాణం యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని, హాజరు వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించి, వివరాలు నమోదు చేయడంతో పాటు సంబంధిత అధికారులు,ఏజెన్సీ ప్రతినిధుల సంతకాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. నీటి సరఫరా సమయంలో అక్రమ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటిని నిబంధనల ప్రకారం వినియోగించుకునేలా ప్రజలకు వివరించాలని, అక్రమ కనెక్షన్ల వల్ల ఇతరులకు నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ,అక్రమ కనెక్షన్లు గుర్తించినప్పుడు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన తాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈ.ఈ శ్రీధర్ రెడ్డి ,ఇరిగేషన్ ఈ ఈ సంజీవ ప్రసాద్ ,ధరూర్ తహసీల్దార్ నందిని,ఇంజినీర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.