🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 24 October 2026, 1:21 am Posted by : Telangana Vaartha

భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్

News Image
Suryapet District News:- భూముల లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కఠిన చర్యలు తీసుకున్నారు. హుజుర్ నగర్ తహసీల్దార్‌ బి.కవిత(B.Kavitha), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కాశీం షరీఫ్‌ ( Kashim Shareef), గ్రామ పాలన అధికారి (జీపీవో) ఎస్‌.కె. జానీ పాషా (SK Jhani Pasha)లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండగానే ఈ చర్యలు చేపట్టారు.
రికార్డులు పరిశీలించకుండానే లావాదేవీలు
హుజూర్‌నగర్‌ గ్రామం, మండల పరిధిలోని సర్వే నంబర్లు 458, 281లో భూముల లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హుజూర్‌నగర్‌ ఆర్డీవో (Huzurnagar RDO) సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ వ్యవహారాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) సాగునీటి కాలువలకు సంబంధించిన భూములు, భూసంస్కరణల చట్టం పరిధిలోని భూముల విషయంలో పాత రెవెన్యూ రికార్డులు, గతంలో జరిగిన విచారణలు, న్యాయస్థానాల ఉత్తర్వులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడం, భూ పరిమితి చట్ట నిబంధనల అమలును పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. అయినప్పటికీ భూముల వాస్తవ స్థితి, భూ పరిమితి చట్టానికి సంబంధించిన వివరాలు, ఎన్‌ఎస్‌పీ కాలువ భూముల రికార్డులను సక్రమంగా పరిశీలించకుండా తప్పుడు ధ్రువీకరణ నివేదికలు సమర్పించినట్లు విచారణలో గుర్తించారు. అందుబాటులో ఉన్న రికార్డులు, న్యాయస్థానాల ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని విధుల పట్ల నిర్లక్ష్యంగా భావించారు.
ఎన్‌ఎస్‌పీ కాలువ భూములు, భూ పరిమితి చట్టం పరిధిలోని భూములను అక్రమంగా బదలాయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపైనా చర్యలకు ఉపక్రమించారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో తప్పుడు డిక్లరేషన్లు సమర్పించినట్లు వచ్చిన ఆరోపణలపై సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు క్రిమినల్‌ ఫిర్యాదు చేశారు.
అక్రమాలను సహించేది లేదు
ప్రభుత్వ భూములు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూములను పరిరక్షించడం రెవెన్యూ అధికారుల ప్రధాన బాధ్యత అని కలెక్టర్‌ స్పష్టం చేశారు. భూ పరిమితి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేదా అవకతవకలకు పాల్పడితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
🏠 Home