కలెక్టరేట్ ఎదుట మృతుడి కుటుంబం ధర్నా
మధ్యలబండ తాండ మర్డర్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్..
హంతకుల నుంచి ప్రాణహాని ఉందని చంద్రునాయక్ కుటుంబం ఆవేదన..
భూ వివాదం నేపథ్యంలో దారుణ హత్యకు గురైన మధ్యలబండ పెద్ద తాండ వాసి చంద్రునాయక్ (45) కుటుంబ సభ్యులు న్యాయం కోసం రోడ్డెక్కారు. తమకు రక్షణ కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చంద్రునాయక్ భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు, బంధువులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో వారు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు.
గ్రామం వీడినా వెంటాడుతున్న భయం...
గత మే 2 న మల్దకల్ మండలం మధ్యలబండ పెద్ద తాండలో భూ తగాదాల కారణంగా చంద్రునాయక్‌ను ఆయన దాయాదులే కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 8 మందిని విచారించి, ముగ్గురు ప్రధాన నిందితులను రిమాండ్‌కు తరలించారు. అయితే మిగతా నిందితుల నుంచి ప్రాణహాని ఉండటంతో భయపడిన మృతుడి కుటుంబం ఊరు విడిచి హైదరాబాద్‌కు వెళ్లి ఆశ్రయం పొందుతోంది.
ఇటీవల దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన చంద్రునాయక్ కుటుంబంపై ప్రత్యర్థులు మరోసారి దాడికి పాల్పడటంతో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.
పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం...
తమ తండ్రిని హత్య చేసిన వ్యక్తుల నుండి తమకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులకు కొమ్ముకాస్తున్నారని మృతుడి పిల్లలు తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ముందే ప్రాణాలు తీసుకుంటామని వారు పెట్రోల్ పోసుకోబోయారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని శాంతింపజేశారు. అనంతరం చంద్రునాయక్ కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకుని, రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేశారు...