ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం
సూర్యాపేట, అక్టోబర్ 23:- పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాలు–2026, పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి ఈరోజు సూర్యాపేట పట్టణంలో నివసిస్తున్న పోలీసు అమరవీరుడు హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో బడే సాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని, విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. 2000 సం.లో తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేసిన సమయంలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్ వారితో వీరోచితంగా పోరాడి అమరులయ్యారని గుర్తుచేశారు. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన పోలీసు శాఖకు గర్వకారణమని అన్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, వారి త్యాగఫలితంగానే ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతోపాటు, వారి సేవలను ప్రజలకు తెలియజేయడం, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దేశం కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను ప్రతి పౌరుడు గౌరవించాలని, వారి త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి కిరణ్, అమర పోలీసు బడే సాహెబ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.