🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 October 2026, 11:12 pm Posted by : Telangana Vaartha

అష్టాదశ శక్తిపీఠాలు నిర్మాణం పూర్తి ఎప్పుడో ?

News Image
ముఖ్యమైన పాయింట్స్:జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయం దారిలో
నిర్మాణాలు పూర్తయితే జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలకు మరింత శోభ.. దక్షిణ తెలంగాణలోనే ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా గద్వాల.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల భక్తులచే కొలువబడుతున్న జమ్మిచేడు జమ్ములమ్మ దేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్తర తెలంగాణలో సమ్మక్క–సారలమ్మ జాతర ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుందో, దక్షిణ తెలంగాణలో జమ్ములమ్మ జాతర, బ్రహ్మోత్సవాలు కూడా అంతటి వైభవాన్ని సంతరించుకోవాలన్నది భక్తుల ఆకాంక్ష.
ఈ నేపథ్యంలో జమ్ములమ్మ ఆలయ ప్రాంగణంలో అష్టాదశ శక్తిపీఠాలను నిర్మించాలన్న సంకల్పానికి భక్తుల నుంచి మద్దతు లభిస్తోంది. ఒక్కో శక్తిపీఠం నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున విరాళాలు అందించేందుకు 18 మంది భక్తులు ముందుకు రావడం విశేషం. మొత్తం 18 అష్టాదశ శక్తిపీఠాలు నిర్మితమైతే ఆలయ ప్రాంగణం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకోవడంతో పాటు, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వారు ఆశిస్తున్నారు.
అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం పూర్తయితే జమ్ములమ్మ ఆలయానికి రాష్ట్రాల సరిహద్దులు దాటి మరింత గుర్తింపు లభించడంతో పాటు, బ్రహ్మోత్సవాల వైభవం మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల విరాళాలకు సార్థకత చేకూరాలంటే వారు ఆశిస్తున్న విధంగా నిర్మాణాలు కార్యరూపం దాల్చడం కీలకమని పేర్కొంటున్నారు.
2022లో అప్పటి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణానికి సంబంధించిన విరాళాల సేకరణ చేపట్టిన నేపథ్యంలో, అప్పుడు భక్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఈ సంకల్పంపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. భక్తులు అందించిన విరాళాలు ఆశించిన ఆధ్యాత్మిక నిర్మాణాలకు ఉపయోగపడి, సంకల్పం కార్యరూపం దాల్చినప్పుడే వారి నమ్మకానికి పూర్తి సార్థకత చేకూరుతుందని భక్తులు కోరుతున్నారు.
అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం పూర్తిచేసి జమ్ములమ్మ ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దితే, భవిష్యత్తులో బ్రహ్మోత్సవాలు మరింత వైభవంగా నిర్వహించేందుకు మార్గం సుగమమవుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల ఆకాంక్షకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తయి, జమ్ములమ్మ దేవస్థానం ఆధ్యాత్మిక వైభవానికి మరింత ప్రతీకగా నిలవాలని కోరుతున్నారు.
🏠 Home