🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 October 2026, 11:05 pm Posted by : Telangana Vaartha

సిద్ధిపేట కమీషనరేట్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

News Image
సిద్దిపేట:- పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని సిద్ధిపేట పోలీస్(siddipet police) కమిషనరేట్ కార్యాలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాస్తుల రక్షణకై విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్, అదనపు డీసీపీలు, అధికారులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిపి రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ,పోలీస్ శాఖ అనేది ప్రతిరోజూ 24 గంటలూ పనిచేసే విభాగామని, పండుగలు, సెలవులు అనే తేడా లేకుండా సిబ్బంది నిరంతరం ఆన్ డ్యూటీలో ఉంటూ ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైన్యం పొంచి దాడి చేసిన ఘటనలో వీరమరణం పొందిన పోలీస్ సిబ్బంది అత్యున్నత త్యాగాలను స్మరించుకుంటూ, నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21ని 'పోలీస్ కొమెమరేషన్ డే' (అమరవీరుల సంస్మరణ దినోత్సవం)గా జరుపుకుంటున్నామని తెలిపారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను, వారి త్యాగాలను డిపార్ట్‌మెంట్ ఎప్పటికీ మరచిపోదని స్పష్టం చేశారు. పోలీస్ కుటుంబాలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా సంప్రదించవచ్చని, సిద్ధిపేట సిపిగా తాను మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశమంతటా పోలీస్ ఉన్నతాధికారులు అమరవీరుల కుటుంబాలకు ఇదే ప్రామిస్ చేస్తున్నారని, ఇంతటి అత్యున్నత త్యాగం చేసినా వారి కుటుంబ సంక్షేమానికి పోలీస్ డిపార్ట్మెంట్ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబ సభ్యులతో సిపి ప్రత్యేకంగా మాట్లాడి, వారి కుటుంబ పరిస్థితులను మరియు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు విన్నవించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇస్తూ, అమరవీరుల కుటుంబ సభ్యులను గౌరవించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, అదనపు డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home