🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 19 October 2026, 6:39 pm Posted by : Telangana Vaartha

వ్యాక్సిన్ల కొరతతో చిన్నారుల తల్లిదండ్రుల అవస్థలు.. అనర్హుడైన సీహెచ్‌వో నరేంద్రను తక్షణమే తొలగించాలి

News Image
* బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్రా రెడ్డి.
జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.

ఐజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెంటావ్యాలెంట్, రోటా వైరస్ వ్యాక్సిన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు.

అయిజ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెంటావ్యాలెంట్ మరియు రోటా వైరస్ వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్రా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన అయిజ పీహెచ్‌సీని సందర్శించి, వ్యాక్సిన్లు దొరకక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల ఆవేదనను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలాంటి లోటు లేకుండా రాష్ట్రాలకు వ్యాక్సిన్లను సప్లై చేస్తుంటే, రాష్ట్రం నుండి జిల్లాకు తెచ్చుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ముఖ్యంగా ఎలాంటి అర్హత లేని వ్యక్తిని, రాజోలి పీహెచ్‌సీలో సీహెచ్‌వో గా పనిచేస్తున్న నరేంద్ర అనే వ్యక్తికి జిల్లా మొత్తం వ్యాక్సిన్ సప్లై బాధ్యతలు అప్పగించడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ఆరోపించారు. ఆ వ్యక్తి సరైన ఇండెంట్ పెట్టకపోవడం వల్లనే జిల్లాకు అరకొరగా వ్యాక్సిన్లు సప్లై అవుతున్నాయని మండిపడ్డారు.
పీహెచ్‌సీలో వ్యాక్సిన్లు దొరకక, బయట మార్కెట్లో వేలకు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేయలేక పేద తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఈ వ్యాక్సిన్లు వేయించకపోతే చిన్నారులు భవిష్యత్తులో ప్రాణాంతకమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే అర్హత లేని సీహెచ్‌వో నరేంద్రను ఆ బాధ్యతల నుంచి తొలగించి, ఆ స్థానంలో ఫార్మసిస్టుకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. జిల్లాకు సరిపడా వ్యాక్సిన్లను సప్లై చేసి ప్రతి చిన్నారుడికి అందుబాటులో ఉంచాలని కోరారు. ఒకవేళ చిన్నారుల ప్రాణాలతో ఇలాగే చెలగాటమాడితే బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు విశ్రమించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షుడు నరసింహ ముదిరాజ్, నాయకులు లక్ష్మణ్ గౌడ్, భీమన్న, రజాక్ నరసింహ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home