ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి -
2026-2027లో ఎలినినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంలో మార్పులు సంభవించడం వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయం, నీటి సంరక్షణ, ప్రజారోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా కమిటీ సూచించింది. తక్కువ నీటితో పండే పంటల సాగు, నీటి పొదుపు, వడదెబ్బ నివారణ చర్యలు, ఆహార భద్రతపై ప్రభుత్వాలు, ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల సైదులు, ప్రధాన కార్యదర్శి షేక్ జాఫర్, కోశాధికారి డాక్టర్ క్రాంతి కుమార్ కోరారు. వ్యవసాయంలో మార్పులతో నీటి పొదుపు ఎల్సినో ప్రభావం వల్ల వర్షపాతంలో మార్పులు, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సూచించింది. వర్షాధార ప్రాంతాల్లో వరి వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలకు ప్రత్యామ్నాయంగా వేరుశనగ, కందులు, పెసలు, సజ్జలు వంటి తక్కువ నీటితో పండే పంటలను స్థానిక వాతావరణం, నేల స్వభావం, వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా సాగు చేయాలని పేర్కొంది. బిందు, తుంపర సేద్య పద్ధతులను వినియోగించడం ద్వారా నీటి వృథాను తగ్గించవచ్చని తెలిపింది. నేలలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు మల్చింగ్ పద్ధతులను అనుసరించాలని, విత్తనాలు వేసే సమయాన్ని వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా నిర్ణయించుకోవాలని రైతులకు సూచించింది. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను సంరక్షించాలని కమిటీ పేర్కొంది. అవసరమైన చోట పూడికతీత, వర్షపు నీటి నిల్వ, ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి పునర్వినియోగం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. భూగర్భ జలాలపై అధికంగా ఆధారపడకుండా, వాటరేడ్ పద్ధతుల ద్వారా భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని తెలిపింది. తాగునీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరింది.ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎండలో తిరగడం తగ్గించాలని, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా గుడ్డ ధరించాలని తెలిపింది. లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిదని పేర్కొంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తాగాలని, అవసరాన్ని బట్టి మజ్జిగ, ఇతర సురక్షిత ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించింది. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలని తెలిపింది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, బయట పనిచేసే కార్మికుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొంది. వాతావరణ మార్పుల ప్రభావంతో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నందున ఆహార భద్రతకు అవసరమైన చర్యలు ముందుగానే చేపట్టాలని జిల్లా కమిటీ ప్రభుత్వాలకు సూచించింది. అవసరమైన ఆహార ధాన్యాల నిల్వలు, తాగునీటి సరఫరా, వ్యవసాయానికి అవసరమైన వనరుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరింది. వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పేర్కొంది. వాతావరణ పరిస్థితులపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడం, అధికారిక వాతావరణ సూచనలను అనుసరించడం, ప్రజలకు ముందస్తు సమాచారం అందించడం ద్వారా నష్టాలను తగ్గించవచ్చని తెలిపింది. శాస్త్రీయ అవగాహనతోనే నష్టాలను తగ్గించవచ్చు ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే మార్పులకు సంబంధించిన వాతావరణ దృగ్విషయం. దీని ప్రభావం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలపై భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల 2026-2027లో తీవ్రమైన 'సూపర్ ఎల్సినో ఏర్పడుతుందనే అంచనాలను అధికారిక వాతావరణ సంస్థల సమాచారంతో పరిశీలించాలని కమిటీ సూచించింది. వ్యవసాయం, నీటి నిర్వహణ, ప్రజారోగ్యం వంటి రంగాల్లో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా వాతావరణ సంబంధిత ముప్పులను సమర్థంగా ఎదుర్కోవచ్చని జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జాఫర్,
కోశాధికారి డాక్టర్ క్రాంతి కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు గొల్లమూడి రమేష్ బాబు, దేవరశెట్టి నాగరాజు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.