కోలాటాలు, పాటలతో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు
సూర్యాపేట : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఆశ్వయుజ అష్టమి సందర్భంగా జరుపుకునే సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పూల పండుగకు ముగింపు పలికారు. అక్టోబర్ 10న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పట్టణంలో సద్దాలచెరువు, విద్యానగర్, భగత్ సింగ్ నగర్, జమ్మిగడ్డ, కృష్ణ టాకీస్ తో పాటు పలు ప్రధాన సెంటర్ లలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తయారు చేసి మహిళా ల నుంచి వృద్ధుల వరకు వచ్చి బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా సమీపంలోని సద్దల చెరువు. తో పాటు ఇతర నీటి వనరుల వద్దకు తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. బతుకమ్మ పాటలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో పట్టణము సందడిగా మారింది. మహిళలు సామూహికంగా బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు. పూల పండుగలో చిన్నారు ఉల్సాహంగా పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం మహిళలు పసుపుతో తయారు చేసిన గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు వాటి విశిష్టతను తెలియజేస్తూ మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.