ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ
సూర్యాపేట:- సాంస్కృతిక వారసత్వానికి, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా శుక్రవారం ప్రభుత్వం ఆదేశాల మేరకు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐక్యతను చాటే పండుగ
మహిళలందరూ సమిష్టిగా చేరి బతుకమ్మ ఆడటం వల్ల సమాజంలో సాంఘిక ఐక్యత మరింత బలపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు విశిష్టమైన పేర్లతో వేడుకలు జరుపుకుంటారని, ఇందులో భాగంగా ఆరవ రోజు ప్రకృతి ప్రసాదించిన తంగేడు, గునుగు, బంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో వేడుకలు జరుపుకోవడం కన్నుల పండుగగా ఉందన్నారు. ఈ వేడుకల్లో కలెక్టరేట్ మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. నిమజ్జన ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు బతుకమ్మ నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటలు మరియు వాగుల వద్ద మహిళలు తగిన జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ కోరారు. జిల్లా వ్యాప్తంగా నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎల్నినో ఎదుర్కొనేందుకు సిద్ధం
ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయ రంగానికి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో 'ఎల్ నినో' ప్రభావం ఎదురయ్యే అవకాశం ఉన్నందున, దానిని ధీటుగా ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలు, ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. భవిష్యత్తులో అందరికీ మంచి రోజులు రావాలని, ప్రజలందరి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, జడ్పీ సీఈవో శిరీష, డిఆర్డిఓ సన్యాసయ్య, పరిశ్రమల శాఖ జీఎం భారతి, డిఐఈఓ సులోచన రాణి, డీఎస్సీడీఓ లత, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, డిసిహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, డిడబ్ల్యూవో నరసింహారావులతో పాటు మహిళా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.