🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 October 2026, 4:45 pm Posted by : Telangana Vaartha

CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ₹20 లక్షలకు పైగా విలువైన 105 మొబైల్ ఫోన్లు

News Image
ముఖ్యమైన పాయింట్స్:బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ కె. నరసింహ
- 15వ సారి 100కు పైగా మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.
- సుదూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన మొబైళ్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన సైబర్ వారియర్స్.
- సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. అత్యాశకు పోయి ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టవద్దు.
- డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.

ప్రజల రక్షణలో పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ప్రజలు వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేయడంలో సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ విశేష కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఇందులో భాగంగా CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ₹20 లక్షలకు పైగా విలువైన 105 మొబైల్ ఫోన్లను శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ విధంగా 100కు పైగా మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయడం ఇది 15వ సారి అని తెలిపారు.
మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగమైందని అన్నారు. కమ్యూనికేషన్‌తో పాటు విలువైన సమాచారం భద్రపరచుకోవడానికి, బ్యాంకింగ్ మరియు ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి మొబైల్ ఫోన్లను విస్తృతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత సమాచారం, కుటుంబ సభ్యుల ఫొటోలు, జ్ఞాపకాలు, ముఖ్యమైన పత్రాలు భద్రపరచుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమతో బహుమతిగా ఇచ్చిన ఫోన్లు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఇలాంటి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు దాని విలువతో పాటు అందులో ఉన్న విలువైన సమాచారం, జ్ఞాపకాలు కోల్పోయిన బాధ బాధితులకు ఉంటుందని అన్నారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటిని గుర్తించి రికవరీ చేస్తున్నదని ఎస్పీ తెలిపారు. పోగొట్టుకున్న కొన్ని మొబైల్ ఫోన్లు సుదూర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినప్పటికీ, సైబర్ వారియర్స్ నిరంతర కృషి, సాంకేతిక విశ్లేషణ ద్వారా వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకున్నారని వివరించారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను అసలు యజమానులకు అందజేయడం ద్వారా బాధితులకు సంతోషం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందని, ప్రజల రక్షణ కోసం పోలీసులు క్షణక్షణం అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు.
సమాజంలో మార్పు తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..
ప్రజలు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారికి సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మహిళలు మరియు బాలల రక్షణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. నేరాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని, నేర ప్రవృత్తి కలిగిన వారిలో మార్పు తీసుకురావడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు. సమాజంలో మంచి వైపు నిలుస్తూ, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించినప్పుడే ప్రశాంతమైన, సురక్షితమైన సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, మొబైల్ ఫోన్ల రికవరీ, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు మరియు బాలల రక్షణతో పాటు డ్రగ్స్ నిర్మూలనకు సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ స్పష్టం చేశారు.
అత్యాశకు పోయి సైబర్ మోసాలకు గురికావద్దు...
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయనే ఆశతో గుర్తుతెలియని వ్యక్తులు సూచించే ఆన్‌లైన్ పెట్టుబడి పథకాలను నమ్మి డబ్బులు పెట్టవద్దని సూచించారు. అలాగే గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, అనుమానాస్పద APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, OTPలు, PINలు ఇతరులకు తెలియజేయవద్దని అన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రహదారులపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని సూచించారు. మన అజాగ్రత్త మన ప్రాణాలకే కాకుండా మనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల జీవితాలపై కూడా ప్రభావం చూపుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. మహిళలు, బాలలను పట్ల.. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు.. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ తెలిపారు. మహిళలు, బాలికలపై వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మహిళలను, బాలలను గౌరవించాలని, వారి భద్రతకు బాధ్యత వహించాలని సూచించారు. మహిళలు, బాలికలపై వేధింపులు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు బాధితులు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ప్రస్తుత సమాజంలో యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సానుకూల కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని తెలిపారు.
🏠 Home