సైబర్ నేరాలపై అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట
సూర్యాపేట, అక్టోబర్ 15: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల మోసపూరిత మాటలు నమ్మి డబ్బులు కోల్పోవద్దని సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ డీఎస్పీ ఏ. వెంకటయ్య సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో భాగంగా గురువారం సూర్యాపేట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు, కోదాడ పట్టణంలో బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకు అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా APK ఫైళ్ల ద్వారా జరిగే మోసాలు, లోన్ మరియు లోన్ యాప్ మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, వ్యాపార, పెట్టుబడి మోసాలు, సెక్స్‌టార్షన్, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో చేసే మోసాల గురించి వివరించారు. సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ మోసాల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- తెలియని వ్యక్తులు పంపే APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు.
- గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దు.
- అధిక లాభాలు వస్తాయనే ఆశతో గుర్తుతెలియని పెట్టుబడి పథకాలను నమ్మవద్దు.
- ఉద్యోగాలు, రుణాల పేరుతో ముందస్తు చెల్లింపులు చేయవద్దు.
- వీడియో కాల్స్ ద్వారా బెదిరింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేసే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పిన్‌లను ఇతరులతో పంచుకోవద్దు.
సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని, అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. బాధితులు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, డబ్బుల బదిలీని నిలిపివేసే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ డీఎస్పీ ఏ. వెంకటయ్య, ఇన్‌స్పెక్టర్ ఎం. శివకుమార్ పాల్గొని సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. మీ డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుచుకోండి.