🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 10:22 pm Posted by : Telangana Vaartha

నాణ్యమైన పత్తితో మద్దతు ధర - జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

News Image
నాణ్యమైన పత్తితో మద్దతు ధర - జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
​తేమ 8 శాతమే ఉండేలా చూసుకోవాలి
​దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
​2026–27 పత్తి మార్కెటింగ్ సీజన్‌లో రైతులు నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసి, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందేలా తగిన జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. పత్తి సాగు, కోత, నిల్వ, విక్రయ ప్రక్రియల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే ఆశించిన మద్దతు ధర లభిస్తుందని స్పష్టం చేశారు.
​నాణ్యతతోనే మంచి మద్దతు ధర
​రైతులు తమ పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చే ముందు తేమ శాతం, పొడవు, మైక్రోనైర్ విలువ వంటి ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు. పత్తిలో తేమ గరిష్ఠంగా 8 శాతం మాత్రమే ఉండేలా బాగా ఆరబెట్టాలని, పత్తిలో ఆకులు, చెత్త మరియు ఇతర వ్యర్థ పదార్థాలు కలవకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.​పత్తి నాణ్యత ఆధారంగానే కొనుగోలు ధర నిర్ణయించబడుతుందని, రైతులు వ్యవసాయ శాఖ అధికారులు మరియు కొనుగోలు కేంద్రాల సిబ్బంది సూచనలను అనుసరించాలని పేర్కొన్నారు. పత్తిని బాగా ఆరబెట్టి, శుభ్రం చేసిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. విక్రయ సమయానికి ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా పుస్తకం, భూ రికార్డుల (పహాణీ/పట్టాదార్ పాస్ పుస్తకం) వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత కోసం అధికారుల సూచనల ప్రకారం నమోదు (రిజిస్ట్రేషన్) ప్రక్రియను పూర్తి చేయాలని, కేంద్రాల్లో జరిగే నాణ్యతా పరీక్షలు, తూకం, చెల్లింపుల ప్రక్రియల్లో ప్రభుత్వ నిబంధనలకు సహకరించాలని కోరారు.
​దళారులను నమ్మి మోసపోవద్దు
​పత్తి విక్రయాల్లో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు విధానాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కొనుగోలు ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను గానీ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను గానీ సంప్రదించాలని కోరారు. రైతుల సంక్షేమం, నాణ్యమైన పత్తి ఉత్పత్తి మరియు సరైన ధర కల్పించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ బి హరి సింగ్ ఆర్డివోస్ సూర్యాపేట కోదాడ హుజూర్నగర్ వేణు మాధవరావు సూర్యనారాయణ శ్రీనివాసులు ఆర్టీవో పురుషోత్తం రెడ్డి డిఎంఓ దామోదర్, హార్టికల్చర్ ఆఫీసర్ నాగయ్య డీఎస్పీలు, కార్యదర్శులు, మిల్లర్లు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
🏠 Home