🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 9:23 pm Posted by : A2TV NEWS

విలేకరులు నిజాలు రాస్తే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..

News Image
అడ్డగూడూరు 15 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- కరీంనగర్ జిల్లా గంభీరావుపేట ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు పొత్తూరి శేఖర్,సంపత్ లపై తమ పై వ్యతిరేక వార్తలు రాస్తున్నారని ఉద్దేశంతో అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన గంభీరావుపేట పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని విధుల నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం అడ్డగూడూరు మండల అధ్యక్షులు నీర్మాల వెంకటేశ్వర్లు మాదిగ డిమాండ్ చేశారు.గురువారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వృత్తి నిర్వహణలో భాగంగా నిజాలను నిర్భయంగా రాస్తే జీర్ణించుకోలేని పోలీసులు అక్రమ కేసులు బనాయించి ముందస్తు సమాచారం లేకుండా కిడ్నాప్ చేసి స్టేషన్ కు తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి శరీరం మీద గాయాలయ్యేలా కొట్టారని అన్నారు.ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే చట్టపరంగా కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలని అలాంటి చట్టాలు లేకపోవడం మూలంగానే అక్రమార్కులు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెపు పరమేష్, అడ్డగూడూరు మండలం మాజీ అధ్యక్షులు పడమటి సైదులు, మండల ఉపాధ్యక్షులు నీర్మాల సందీప్, ప్రధాన కార్యదర్శి బాలెంల పరుశురాములు, కడియం రవివర్మ, చింత సుధాకర్, బాలెంల త్రివేణి,తదితరులు పాల్గొన్నారు.
🏠 Home