🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 11:01 pm Posted by : Telangana Vaartha

బ్యాంక్ అధికారులతో బ్యాంక్ ల వద్ద భద్రత అంశాలపై సమావేశం

News Image
బ్యాంక్ అధికారులతో బ్యాంక్ ల వద్ద భద్రత అంశాలపై సమావేశం నిర్వహించి సూర్యాపేట పట్టణ పోలీస్, కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్.
- బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలి.
- నైట్ పెట్రోలింగ్‌లో ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ వద్ద నిరంతర తనిఖీలు.
- బ్యాంకు అధికారులతో సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచనలు
సూర్యాపేట: బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు సహా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ బ్యాంకు అధికారులకు సూచించారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ నందు పట్టణంలోని వివిధ బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించి, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రజలు తమ కష్టార్జిత సొమ్మును భద్రపరుచుకునే బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించడం ఎంతో ముఖ్యమని డీఎస్పీ పేర్కొన్నారు. ఖాతాదారుల నగదు, ఆస్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బ్యాంకు అధికారులు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నేరగాళ్లు ఏటీఎం కేంద్రాల్లో, బ్యాంక్ ల్లో చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రత్యేక పరికరాలతో కూడిన కిట్లను చిన్న సూట్‌కేసుల్లో తీసుకువచ్చి, సాధారణ వ్యక్తులుగా ఏటీఎం కేంద్రాల్లోకి, బ్యాంక్ లోకి ప్రవేశించి, అతి తక్కువ సమయంలో ఏటీఎంలను ధ్వంసం చేసి నగదును అపహరిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద కదలికలు గుర్తించినప్పుడు వెంటనే అప్రమత్తం చేసేలా అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. బ్యాంకుల్లోకి అపరిచితులు లేదా అనుమానాస్పద వ్యక్తులు ప్రవేశించినప్పుడు, ఆయుధాలతో ఎవరైనా వచ్చినప్పుడు తక్షణమే పోలీసులకు సమాచారం అందేలా సమర్థవంతమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బ్యాంకుల వద్ద అనుమానాస్పద శబ్దాలు, కదలికలు లేదా ఇతర అసాధారణ పరిస్థితులు గుర్తించిన వెంటనే బ్యాంకు అధికారులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నైట్ పెట్రోలింగ్‌లో ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ వద్ద తనిఖీలు.. పోలీసు శాఖ రాత్రి గస్తీలో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోందని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. నైట్ పెట్రోలింగ్‌లో భాగంగా బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు తదితర ప్రతి ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ వద్ద భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తూ, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా సంస్థల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని తెలిపారు. బ్యాంకు అధికారులు కూడా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. రాత్రివేళ బ్యాంకుల వద్ద అవసరమైన భద్రతా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, సెక్యూరిటీ సిబ్బందికి బ్యాంకు అధికారుల ఫోన్ నంబర్లతో పాటు స్థానిక పోలీసుల సంప్రదింపు నంబర్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు.
నగదు రవాణా సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు.. బ్యాంకుల నుంచి ఏటీఎం కేంద్రాలకు, ఇతర బ్యాంకులకు నగదును తరలించే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. నగదు రవాణాకు ముందు బ్యాంకు పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారేమో గమనించాలని, నగదు తరలింపు సమయంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. బ్యాంకు అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
సైబర్ నేరాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలి.. సైబర్ నేరాల నివారణకు బ్యాంకు అధికారులు ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. అత్యాశ, అవగాహన లోపంతో ప్రజలు సైబర్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, పిన్ నంబర్లు అపరిచితులకు వెల్లడించవద్దని సూచించారు. బ్యాంకుల్లో అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేసి, ఖాతాదారులకు తరచూ సూచనలు ఇవ్వాలని కోరారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ లు కనకరత్నం, రహిముడ్డిన్, పట్టణంలోని వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home