పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు
- విద్యార్థులు, ప్రజల్లో పోలీసు విధులు, త్యాగాలు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు.
- విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు..
- షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు
- రక్తదాన శిబిరాలు, అవగాహన ర్యాలీలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాల నిర్వహణ.
... సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ.
సూర్యాపేట జిల్లా:- దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, సమాజ రక్షణ, ప్రజల భద్రత కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె. నరసింహ, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అక్టోబర్ 21వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి, దేశం కోసం, ప్రజల రక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ ఐక్యతా దినోత్సవం వరకు పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలపై ప్రజల్లో అవగాహన... పోలీసు అమరవీరుల త్యాగాలు, వారి బలిదానాలు, ఆశయాలను ప్రజలకు తెలియజేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, పోస్టర్లను ఏర్పాటు చేయడంతోపాటు పోలీస్ ఫ్లాగ్ డేకు సంబంధించిన వీడియోలను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు శాఖ నిర్వహిస్తున్న విధులు, ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలు, పోలీసు అమరవీరుల త్యాగాల ప్రాముఖ్యతను విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు వివరించేలా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామాలు, కాలనీల్లో ప్రజలతో మమేకం, పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది, గ్రామ పోలీసు అధికారులు తమ పరిధిలోని గ్రామాలు, కాలనీలను సందర్శించి ప్రజల సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఓపెన్ హౌస్ కార్యక్రమాలు... విద్యార్థులు, పౌరులకు పోలీసు వ్యవస్థ పనితీరుపై అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పోలీసుల విధులు, ఆయుధాల వినియోగం, పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థ, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల దర్యాప్తు విధానం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజలకు అందించే పోలీసు సేవల గురించి వివరించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ప్రజావగాహన కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించి పోలీసు వ్యవస్థపై అవగాహన పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు..
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన పెంపొందించేందుకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఇంటర్మీడియట్ స్థాయి వరకు విద్యార్థులకు:.
- సైబర్ నేరాల నివారణలో పోలీసుల, పౌరుల పాత్ర.
- మాదకద్రవ్యాల నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు.
డిగ్రీ మరియు ఆపై స్థాయి విద్యార్థులకు:.
- సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర.
- తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో విద్యార్థుల పాత్ర.
ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల వ్యాసాలను పరిశీలించి భాషాప్రాతిపదికన ఉత్తమ మూడు వ్యాసాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన వ్యాసాలను వార్తాపత్రికల్లో ప్రచురించడంతోపాటు జిల్లా పోలీస్ సోషల్ మీడియా ఖాతాల్లోనూ పోస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు.. పోలీసుల విధులు, త్యాగాలు, సేవలు, ప్రతిభను ప్రతిబింబించేలా షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల సేవలు, త్యాగాలు, ప్రజల రక్షణ కోసం వారు చేస్తున్న కృషిని తెలియజేసే ఫొటోగ్రాఫ్లతోపాటు గరిష్ఠంగా మూడు నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను ఈ పోటీలకు పంపవచ్చని తెలిపారు. వచ్చిన ఎంట్రీల్లో ఉత్తమ మూడు షార్ట్ ఫిల్మ్‌లు, ఉత్తమ మూడు ఫొటోగ్రాఫ్‌లను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ షార్ట్ ఫిల్మ్‌లు, ఫొటోగ్రాఫ్‌లను జిల్లా పోలీస్ పీఆర్ఓకు అందజేయాలని కోరారు.
పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు.. పోలీసు సిబ్బందిలో ప్రజాసేవ పట్ల నిబద్ధతను పెంపొందించడంతోపాటు పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ పోటీల్లో ప్రధానంగా కింది అంశాలను చేర్చనున్నట్లు వెల్లడించారు.
- ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుంచి ఆశించే సేవలు.
- ఎస్సై, ఆపై స్థాయి అధికారులకు: పౌరుల మన్ననలు పొందేందుకు పోలీసులు చేయాల్సిన కృషి.
- క్షేత్రస్థాయి పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం.
ఈ అంశాలపై పోలీసు సిబ్బంది తమ ఆలోచనలు, అనుభవాలు, సూచనలను వ్యాసాల రూపంలో వ్యక్తపరిచేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలపై ప్రత్యేక కథనాలు.. పోలీసు అమరవీరుల త్యాగాలు, విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే సవాళ్లు, ప్రజల రక్షణలో పోలీసుల పాత్రను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక కథనాలు, వ్యాసాలను ప్రచురించనున్నట్లు ఎస్పీ తెలిపారు. జర్నలిస్టులు పోలీసు అమరవీరుల త్యాగాలు, పోలీసుల సేవలపై వ్యాసాలు రాసి ప్రచురించడంతోపాటు వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా అమరవీరుల త్యాగాలు, విధి నిర్వహణలో వారి సేవలపై వ్యాసాలు రాయాలని, వాటిని రాష్ట్రవ్యాప్తంగా పత్రికల్లో ప్రచురించేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలను పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకోనున్నట్లు ఎస్పీ తెలిపారు. అమరవీరుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలను గుర్తించి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు.
రక్తదాన శిబిరాలు, అవగాహన ర్యాలీలు.. పోలీసు అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా రక్తదాన శిబిరాలను నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు రక్తాన్ని అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించి పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతోపాటు ప్రజలకు పోలీసు సేవల ప్రాముఖ్యతను వివరించనున్నట్లు పేర్కొన్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.. దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ శ్రీ కె. నరసింహ, ఐపీఎస్ గారు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, ప్రజలు, పోలీసు సిబ్బంది, వివిధ వర్గాల వారు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ కోరారు.