ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న ‘ప్రజావాణి’
"తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న “ప్రజావాణి” కార్యక్రమం కిందిస్థాయిలో మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోని అధికారులు ప్రజలను నిరాశపరుస్తున్నారు. తిరుమలగిరి మండల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిరాశాజనక దృశ్యాలకు వేదికైంది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరు కాకపోవడంతో ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిచ్చాయి. ఎస్టీ వెల్ఫేర్ , డిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్, సివిల్ సప్లై, పోలీస్, హౌసింగ్ ,ఫారెస్ట్, వ్యవసాయ, పశువు సమర్థత, మత్స్యశాఖ, హార్టికల్చర్, ట్రైబల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్ శాఖల అధికారులు గైర్హాజరు కావడం వల్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించే వారు లేకపోయారు.
ఉదయం నుంచే తమ సమస్యలు చెప్పుకోవాలని ఆశతో వచ్చిన ప్రజలు తీవ్ర ఎండను తట్టుకుని గంటల తరబడి వేచి చూసినా, చివరికి ఎవరూ స్పందించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం పై నమ్మకంతో వచ్చిన ప్రజలకు ఈ పరిస్థితి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం ప్రజల సమస్యలు వినేందుకు అందుబాటులో ఉంటున్నప్పటికీ, కిందిస్థాయి అధికారులు మాత్రం విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ పరిస్థితి పై కలెక్టర్ స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్న ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన ప్రజావాణి కార్యక్రమం ఇలా నిర్వీర్యం కావడం ప్రజా పాలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇకనైనా అధికారులు బాధ్యతతో వ్యవహరించి ప్రజావాణి కొచ్చి ప్రజల వద్ద దరఖాస్తులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు