పలు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తిరుమలగిరి పట్టణంతో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. మండల కేంద్రంలోని నందపురం అంగన్వాడి సెంటర్లో చిన్నారులు బతుకమ్మను పేర్చి ఆట ఆడుతూ పాట పాడుతూ అలరించారు అనంతరం మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు వివిధ రకాల పూలను సేకరించి అందమైన బతుకమ్మలను పేర్చి పాఠశాలలకు తీసుకువచ్చారు. సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పటికీ మరిచిపోకూడదని, బతుకమ్మ పండుగ విశిష్టతను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు