🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 October 2026, 7:38 pm Posted by : Telangana Vaartha

మహబూబాబాద్‌కు ‘సీసీ’ రక్షణ ఏది

News Image
​కొన్ని చోట్ల సగం విరిగిపోయి, నేలచూపులు చూస్తున్న నిఘా నేత్రాలు!
​మరికొన్ని కీలక ప్రాంతాల్లో అసలే లేని సీసీ కెమెరాల వ్యవస్థ
​నూతన జిల్లా కేంద్రంలో పెరుగుతున్న రాకపోకలు... అదనుగా భావిస్తున్న అసంఘటిత శక్తులు ​దొంగతనాలు, కొట్లాటలు, మహిళలపై వేధింపులకు చెక్ పడేది ఎలా? ​బతుకమ్మ పండుగ వేళ పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ ప్రజల డిమాండ్
✍️ ఇండ్ల మహేష్ ​ మహబూబాబాద్ (పట్టణం):
మహబూబాబాద్ నూతనంగా జిల్లాగా అవతరించిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లా కేంద్రం కావడంతో ప్రతినిత్యం చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి వేలాది మంది ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు వివిధ పనుల నిమిత్తం పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, ఇంతగా జనసమ్మర్ధం పెరుగుతున్నా పట్టణంలో భద్రతా వ్యవస్థ మాత్రం నామమాత్రంగానే ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరాల అదుపునకు, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత కీలకమైన సీసీ (CCTV) కెమెరాల నిఘా వ్యవస్థ మహబూబాబాద్‌లో పూర్తిగా పడకేసింది. ​'నేలచూపులు' చూస్తున్న కెమెరాలు – నిఘా వ్యవస్థ నిర్వీర్యం: ​పట్టణంలో ఉన్న అరకొర సీసీ కెమెరాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కొన్ని ముఖ్యమైన జంక్షన్లలో అమర్చిన కెమెరాలు వైరింగ్ తెగిపోయి, కనెక్టర్లు ఊడిపోయి, సగం విరిగిపోయి "నేలచూపులు" చూస్తున్నాయి. మరికొన్ని చోట్ల వైర్లు వేలాడుతూ కేవలం షోకేస్ బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో నిర్వహణ కరువై ఇవి నామరూపాల్లేకుండా పోతున్నాయి. ఇక పట్టణంలోని అనేక కీలకమైన వీధులు, రద్దీ ప్రాంతాలు మరియు కొత్తగా వెలిసిన కాలనీలలో అసలు సీసీ కెమెరాల వ్యవస్థే లేకపోవడం గమనార్హం.
​ఎవరు సాధువో... ఎవరు దొంగో తెలవని పరిస్థితి:
​రోజువారీ రాకపోకలు పెరగడాన్ని ఆసరాగా చేసుకుని అపరిచిత వ్యక్తులు, అసంఘటిత శక్తులు పట్టణంలో అక్రమాలకు తెరలేపుతున్నారు. వేలమంది తిరిగే ప్రాంతాల్లో ఎవరు సాధువో... ఎవరు దొంగో గుర్తించడం పోలీసు శాఖకు సవాలుగా మారింది.
​గొడవలు, కొట్లాటలు: నిఘా లేకపోవడంతో ఆకతాయిలు, పోకిరీ మూకలు చిన్న విషయాలకే గ్రూపులుగా విడిపోయి వీధుల్లో కొట్లాటలకు దిగుతున్నారు.
​చోరీలు & అక్రమాలు: ఇళ్లలో, దుకాణాల్లో దొంగతనాలు జరుగుతున్నా, నేరం చేసిన తర్వాత నేరస్థులు ఏ వైపు పారిపోయారో తెలుసుకోవడానికి పోలీసులకు ఎలాంటి సీసీ ఫుటేజీ ఆధారాలు దొరకడం లేదు.
​మహిళల భద్రతకు ముప్పు – బతుకమ్మ వేడుకల వేళ ఆందోళన:
​జిల్లా కేంద్రంలో కళాశాల విద్యార్థినులు, మహిళల రాకపోకలు అధికంగా ఉంటాయి. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, మార్కెట్ ప్రాంతాల్లో అసంఘటిత మూకలు మహిళలను వేధించడం, కించపరిచేలా ప్రవర్తించడం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో వేలాది మంది మహిళలు అర్ధరాత్రి వరకు వీధుల్లో, చెరువు ఘాట్ల వద్ద వేడుకల్లో పాల్గొంటారు. ఇటువంటి సమయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఆడపడుచుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
​అధికారులు తక్షణమే నిద్రమత్తు వీడాలి:
​ఒక చిన్న సీసీ కెమెరా అనేది 24 గంటలు పనిచేసే నిశ్శబ్ద పోలీసు అధికారితో సమానం. కెమెరాల నిఘా ఉంటే నేరస్థుల్లో భయం ఏర్పడి, 80 శాతం నేరాలు ముందే ఆగిపోతాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి:
​పాడైపోయి, నేలచూపులు చూస్తున్న పాత కెమెరాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాలి.
​అసలు నిఘా లేని ప్రధాన కూడళ్ళు, బతుకమ్మ ఘాట్లు, రద్దీ ప్రాంతాలలో కొత్తగా ఆధునిక సీసీ కెమెరాలను అమర్చాలి.
​కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టి మహబూబాబాద్ పట్టణ ప్రజలకు, మహిళలకు పూర్తి భద్రత కల్పించాలి.
🏠 Home