మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
సూర్యాపేట జిల్లా కేంద్రం, విద్యానగర్:విద్యానగర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఆనందంగా గడిపారు. దీంతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థినుల ఉత్సాహం, ఆటపాటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మానస మాట్లాడుతూ.. విద్యార్థినులంతా ఒకచోట చేరి, అధ్యాపకులతో కలిసి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా తెలుసుకుని వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థినుల్లో ఐక్యత, సోదరభావం పెంపొందడంతో పాటు మన సంప్రదాయాల పట్ల మరింత అవగాహన కలుగుతుందని ప్రిన్సిపల్ మానస తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.