🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 October 2026, 6:43 pm Posted by : Telangana Vaartha

సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

News Image
పోలీస్ అధికారులు ఎవ్వరూ ఫోన్ లో డిజిటల్ అరెస్ట్ చేయరు.. జిల్లా ఎస్పీ కె. నరసింహ సైబర్ మోసాల నివారణ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న పోలీస్ ప్రజా భరోసా, “సైబర్ జాగ్రత్త్ దివాస్” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సైబర్ మోసాల నివారణ, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ధ్రువీకరించండి "ఆగండి, ఆలోచించండి, ధృవీకరించిండి నిర్ణయం తీసుకోండి" అనే నినాదంతో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ సంబంధిత అధికారులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డిజిటల్ అవగాహన, సైబర్ భద్రతపై జ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. ప్రజలు సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ “సైబర్ వారియర్”గా మారి సైబర్ నేరాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనుమానిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా సందేశాలు, అనుమానాస్పద లింకులను అనుసరించవద్దని కలెక్టర్ సూచించారు. తెలియని వ్యక్తులు సూచించే పెట్టుబడులు, ఆన్‌లైన్ టాస్కులు, అధిక లాభాల పథకాలలో భద్రతను నిర్ధారించుకోకుండా డబ్బులు పెట్టుబడి పెట్టవద్దన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే అత్యాశకు లోనుకావద్దని ప్రజలను హెచ్చరించారు. తెలియని అనుమానస్పద లింకులపై అనుసరించి అపరిచితులకు డబ్బు పంపవద్ధు, OTP, PIN, CVV, పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పవద్దు. అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయనే ఆఫర్లను నమ్మవద్దు. సోషల్ మీడియాలో వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దు. పోలీస్, CBI, CID, RBI వంటి సంస్థల పేరుతో వచ్చే బెదిరింపు కాల్స్‌ను నమ్మవద్దు. “డిజిటల్ అరెస్ట్” పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలి. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి అని కలక్టర్ అన్నారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లాలో సైబర్ నేరాల నివారణ కోసం నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి బుధవారం నిర్వహించే “పోలీస్ ప్రజాబరోసా”, “సైబర్ జాగ్రత్త్ దివాస్” కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం సూచనల మేరకు జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. ప్రజల అత్యాశ, అవగాహన లోపాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, మెయిల్ తదితర మార్గాల ద్వారా ప్రజలను సంప్రదించి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఆన్‌లైన్ ట్రేడింగ్, పెట్టుబడులు, టాస్క్‌లు, వర్చువల్ అకౌంట్ల పేరుతో నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లలో డబ్బులు జమ చేయించి, అకౌంట్‌లో భారీ మొత్తాలు ఉన్నట్లుగా చూపించి, వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు మరింత డబ్బు చెల్లించాలని కోరుతూ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. సీబీఐ, సీఐడీ, ఐబీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లు ఉపయోగిస్తూ, పోలీస్ అధికారులు లేదా ఇతర అధికారుల ఫొటోలు, నకిలీ గుర్తింపు కార్డులు చూపిస్తూ వీడియో కాల్స్ చేసి “మీపై కేసు నమోదైంది”, “మీ ఫోన్‌లో అక్రమ కార్యకలాపాలు గుర్తించాం”, “మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారు” అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా తదితర నేరాలతో మీకు సంబంధం ఉందని చెప్పి కేసుల నుంచి తప్పించాలంటే డబ్బులు చెల్లించాలని కోరడం సైబర్ నేరగాళ్ల మోసపూరిత పద్ధతి అని తెలిపారు. “డిజిటల్ అరెస్ట్” అనే విధానం లేదని ప్రజలు స్పష్టంగా గుర్తించాలని ఎస్పీ సూచించారు. ఏ ప్రభుత్వ లేదా పోలీస్ అధికారి ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా బెదిరించి డబ్బులు చెల్లించాలని కోరితే నమ్మవద్దన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు. మోసానికి సంబంధించిన ఫోన్ నంబర్లు, మెసేజ్‌లు, లింకులు, బ్యాంక్ లావాదేవీ వివరాలు, స్క్రీన్‌షాట్‌లు వంటి ఆధారాలను భద్రపరచుకోవాలని తెలిపారు. “గోల్డెన్ అవర్”ను సద్వినియోగం చేసుకుంటే మోసపోయిన నగదును నిలిపివేయడం లేదా రికవరీ చేసే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. అందువల్ల మోసం జరిగిన విషయం దాచకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ లు అనూష, రవితేజ , సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, టెక్నికల్ టీమ్ ఎస్‌ఐ సాయిరామ్, ఆర్‌ఎస్‌ఐ సాయిరామ్, సురేష్, చివ్వెంల ఎస్‌ఐ మహేష్, జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ మోసాల నివారణకు అందరం కలిసి పనిచేద్దాం – జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట వారిచే జారీ చేయనైనది
🏠 Home