🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 8:11 pm Posted by : Telangana Vaartha

ఎరుకల కుటుంబంపై దౌర్జన్యాలా

News Image
... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టాలి
... కురవిలో ప్రభుత్వ భూమిపై అక్రమ పట్టా ఆరోపణలు.. బాధితులపై దాడులు!
... ఇళ్ల మధ్య పేలుళ్లు.. కులం పేరుతో దూషణలు!
... సర్వే నంబర్ 852పై సమగ్ర విచారణ జరపాలి.. బాధితులకు న్యాయం చేయాలి
... అక్రమ పట్టాలు.. దాడులు.. బెదిరింపులు! న్యాయం చేయకుంటే ప్రజా సంఘాలతో ఉద్యమమే : బీఎస్పీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ మలి దశ ఉద్యమకారులు దార్ల శివరాజ్
మహబూబాబాద్ జిల్లా, అక్టోబర్ 6 :
కురవి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో ప్రభుత్వ ఖాళీ స్థలానికి సంబంధించి అక్రమ పట్టా ఆరోపణలు, నివాస గృహాల మధ్య పేలుడు పదార్థాలతో భారీ శబ్దాలు చేయడం, ప్రశ్నించిన బాధితులను కులం పేరుతో దూషిస్తూ దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు , తెలంగాణ మలి దశ ఉద్యమకారులు దార్ల శివరాజ్ డిమాండ్ చేశారు. కురవికి చెందిన బాధితుడు నిమ్మశెట్టి వెంకన్న, ఆయన కుటుంబ సభ్యులు తమపై జరుగుతున్న అన్యాయాన్ని బీఎస్పీ రాష్ట్ర నాయకులు , తెలంగాణ మలి దశ ఉద్యమకారులు దార్ల శివరాజ్‌కు వివరించారు. బాధితులు అందించిన ఆధారాలు, రికార్డులను పరిశీలించిన అనంతరం మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధితులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దార్ల శివరాజ్ మాట్లాడుతూ.. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన అమాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న తల్లూరి వీరన్న, తల్లూరి లక్ష్మీనారాయణ, తాళ్లూరి సంతోష్, చిలుముల సంతోష్, చిలుముల శ్రీకాంత్ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులను కులం పేరుతో దూషించి, అవమానించి, దాడులు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన అంశమన్నారు.

సర్వే నంబర్ 852పై సమగ్ర విచారణ చేయాలి :
కురవిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 852కు సంబంధించి పూర్వపు లింకు పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, హక్కులు, స్వాధీనం తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని శివరాజ్ కోరారు. రామక్క ఒకే ఇంటికి ఒకే నంబర్ ఉన్న పరిస్థితుల్లో ఒకే ఇంటి నెంబర్ పై 7 గురికి రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? సంబంధిత రికార్డులు ఎలా సృష్టించబడ్డాయి? అనే అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూమికి సంబంధించి పట్టా ఎలా మంజూరైంది? దానికి సంబంధించిన రికార్డులు ఏమిటి? అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

ఇళ్ల మధ్య పేలుళ్లపై చర్యలు ఏవీ..?
నివాస గృహాల మధ్య పేలుడు పదార్థాలు ఉపయోగిస్తూ భారీ శబ్దాలు చేయడం వల్ల స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని శివరాజ్ ఆరోపించారు. పేలుడు పదార్థాల వినియోగానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? నిబంధనలకు అనుగుణంగానే వినియోగిస్తున్నారా? అనే అంశాలపై పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. బాధితులపై దాడులు, బెదిరింపులు, కులం పేరుతో దూషణలకు పాల్పడిన వారిపై SC/ST (Prevention of Atrocities) Actతో పాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

న్యాయం చేయకుంటే ప్రజా సంఘాలతో ఉద్యమం :
బాధిత కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు వారి నివాసానికి, ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని శివరాజ్ కోరారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే మాల మహానాడు, ఎంఆర్పీఎస్, గిరిజన సంఘాలు, ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఎస్పీ రాష్ట్ర నాయకులు దార్ల శివరాజ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు బెజ్జం ఐలయ్య, బాధితులు పాల్గొన్నారు
🏠 Home