ప్రజలు మా ప్రభుత్వానికి అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా మునగాల మండలంలో అత్యాధునిక సదుపాయాలతో వంటశాలను ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా సంక్షేమం, విద్య, అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గతంలో దొరల పాలనలో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అయన అన్నారు.
రూ.200 కోట్ల భారీ వ్యయంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ పాఠశాలను నిర్మిస్తున్నాం - రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాము కూర్చున్న ప్రదేశంలో చరిత్ర సృష్టించేలా అత్యున్నత ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక సదుపాయాలతో పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని, పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ఉంటుందని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజల సహకారాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి లక్షకు పైగా ఓట్ల మెజార్టీ అందించారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు పర్యాయాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలే తనకు దేవుళ్లని అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట స్థానం కలిగిన నాయకుడని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్, తహశీల్దార్ స్రవంతి, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సూర్యాపేట వారిచే జారీ చేయనైనది