ఆర్డీఎస్ సమస్యల పరిష్కారానికి చర్చావేదిక
అలంపూర్, అక్టోబర్ 5: ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యల పరిష్కారం, పెండింగ్ ప్రాజెక్టుల పనుల పూర్తిపై త్వరలో అలంపూర్ చౌరస్తాలో విస్తృత స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి అలంపూర్ తాలూకా జేఏసీ కన్వీనర్ రామ్మోహన్ తెలిపారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.
ఆర్డీఎస్ను బ్యారేజీగా మార్చి ఆయకట్టుకు రావాల్సిన నీటిని సాధించాలని, కాలువను ఆధునీకరించాలని నిర్ణయించారు. నెట్టెంపాడు లింక్ రిజర్వాయర్ల 99, 100 ప్యాకేజీల పెండింగ్ పనులు పూర్తి చేయడంతోపాటు చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తిచేసి ఆర్డీఎస్కు అనుసంధానం చేయాలని తీర్మానించారు. గూడెందొడ్డి రిజర్వాయర్ ద్వారా ఇటిక్యాల నుంచి మానోపాడుకు వచ్చే కాలువను ఆర్డీఎస్ కాలువకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. మారమునగాల (ప్రాగటూరు) వద్ద లిఫ్ట్‌ను 32ఏ డిస్ట్రిబ్యూటర్‌కు అనుసంధానం చేస్తే సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని సమావేశంలో చర్చించారు. దీంతో ఉండవెల్లి, అలంపూర్ ప్రాంతాల్లోని చివరి ఆయకట్టు రైతులకు నీరందేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. గొందిమల్ల బ్యారేజీ నిర్మాణం, చిన్న తాండ్రపాడు చెరువు పూడికతీత, ఆధునీకరణ పనులు చేపట్టాలని తీర్మానించారు. ఆర్డీఎస్ సమస్యలపై విస్తృతంగా చర్చించేందుకు అలంపూర్ చౌరస్తాలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి, రైతులు, ప్రజలు, ఆయకట్టు ప్రాంతాల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జేఏసీ నాయకులు హనుమంతు,రైతు సంఘం జిల్లా నాయకులు జి కే ఈదన్న, ఉండవల్లి మండల సర్పంచుల సంఘము మాజీ అధ్యక్షుడు ఇటిక్యాల పాడు సురవరం లోకేశ్వర్‌రెడ్డి,మిట్టదొడ్డి నరసింహులు,సింగవరం 1 గ్రామ సర్పంచ్ గొంగళ్ల ఈశ్వర్, కంచుపాడ్ మాజీ సర్పంచ్ శేషన్గౌడ్, రాఘవేంద్ర , గోపాల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.