జోగులాంబ గద్వాల 6అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల్. జిల్లాలో పోలీస్ ఫ్లాగ్ డే (అమరవీరుల స్మారక వారోత్సవాలు) 21st అక్టోబర్ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నిమిషాల లఘుచిత్రం (షార్ట్ ఫిల్మ్) మరియు ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే ఆసక్తి ఉన్న ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు మరియు సృజనాత్మక ప్రతిభ కలిగిన వారు పోలీస్ శాఖ విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలు, పోలీస్–ప్రజల స్నేహపూర్వక సంబంధాలు, అమరవీరుల త్యాగాలు, మహిళలు మరియు పిల్లల భద్రత, ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత, నేర నియంత్రణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు తదితర పోలీస్ శాఖకు సంబంధించిన అంశాలను ప్రతిబింబించేలా లఘుచిత్రాలు, ఛాయాచిత్రాలను రూపొందించవచ్చని ఎస్పీ తెలిపారు. లఘుచిత్రం గరిష్టంగా 3 నిమిషాల నిడివితో ఉండాలని, ఫోటోగ్రఫీ పోటీలో ఇటీవల తీసిన పోలీస్ శాఖకు సంబంధించిన అంశాలను ప్రతిబింబించే ఉత్తమ ఛాయాచిత్రాలను సమర్పించాలని సూచించారు. పోటీలలో పాల్గొనదలచిన వారు తమ లఘుచిత్రాలు మరియు ఛాయాచిత్రాలను 23.10.2026 లోపు జిల్లా పోలీస్ కార్యాలయంలోని PRO Naveen – 8712661828 కు అందజేయాలని ఎస్పీ తెలిపారు.
జిల్లా స్థాయిలో న్యాయనిర్ణేతల ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడు లఘుచిత్రాలు మరియు మూడు ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపిక చేసి, విజేతలకు జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎంపికైన టాప్–3 లఘుచిత్రాలు మరియు ఛాయాచిత్రాలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విజేతలకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ప్రతిభా పత్రాలు, బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ సేవలను, అమరవీరుల త్యాగాలను, సమాజ భద్రత కోసం పోలీసులు చేస్తున్న కృషిని సృజనాత్మకంగా ప్రజలకు చేరువ చేసే ఈ అవకాశాన్ని ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ కోరారు.