లంబాడి విద్యార్థి సేన ఆధ్వర్యంలో నూతన నియామకాలు
సూర్యాపేట జిల్లా:- చివ్వెంల: లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్ గారి ఆధ్వర్యంలో లంబాడి విద్యార్థి సేనను సూర్యాపేట జిల్లాలో మరింత బలోపేతం చేయడంలో భాగంగా సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్గా ధరావత్ సుమన్ నాయక్ గారిని, చివ్వెంల మండల అధ్యక్షుడిగా బానోతు రమేష్ నాయక్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ ధరావత్ సుమన్ నాయక్ మాట్లాడుతూ లంబాడీలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్, విద్యా మరియు ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ఎన్నికల సమయంలో లంబాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీలంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని, లంబాడి విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. చివ్వెంల మండల అధ్యక్షుడు బానోతు రమేష్ నాయక్ మాట్లాడుతూ మండలంలో లంబాడి విద్యార్థి సేనను మరింత బలోపేతం చేస్తానని, విద్యార్థులు మరియు లంబాడీలకు జరిగే ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. లంబాడీలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను అరికట్టేందుకు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ లంబాడి సమాజం అనేక రంగాల్లో ఇంకా వెనుకబడి ఉందని, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు సంక్షేమ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు.
సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ శివ నాయక్ మాట్లాడుతూ లంబాడీ సమాజం ఎన్నో సంవత్సరాలుగా అనేక హామీలను నమ్మి మోసపోతూ వస్తోందని అన్నారు. లంబాడీల ఓట్లతో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికీ, లంబాడీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో, మంత్రి పదవులు ఇవ్వడంలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో లంబాడీలకు ఇచ్చిన హామీలైన ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక నిధులు, మండల స్థాయిలో గురుకులాల ఏర్పాటు, మహిళలకు స్కూటీ, పదో తరగతి పూర్తి చేసిన వారికి ₹5,000, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి ₹15,000 తదితర హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకపోతే లంబాడి విద్యార్థి సేన ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బానోతు హరీష్ నాయక్, లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర కార్యదర్శి ధరావత్ రవి నాయక్, లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్, లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ శివనాయక్ బానోత్ శివాజీ, జిల్లా నాయకులు రవీందర్, లక్ష్మణ్, నాగరాజు, నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.